- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలమూరు వేదికగా గులాబీ గర్జన!
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల అనంతరం రెండేళ్లకు పైగా స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ పై పాలమూరు వేదికగా యుద్ధం ప్రకటించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.

ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతుండడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని, ముఖ్యంగా రైతు సమస్యలను అస్త్రంగా చేసుకుని సమరశంఖం పూరించేందుకు పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని, 80శాతం పనులు పూర్తయినా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం లేదని బీఆర్ఎస్ ప్రధానంగా విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే జనవరిలో భారీ బహిరంగ సభ నిర్వహించి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నిర్ణయించారు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రాజెక్టులను సందర్శించనుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తూ కేడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని గులాబీ దళం భావిస్తోంది.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల అనంతరం రెండేళ్లకు పైగా స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ పై పాలమూరు వేదికగా యుద్ధం ప్రకటించేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, తదితర హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వానికి కనీసం రెండు సంవత్సరాలు ఇవ్వాలని భావించారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తుండటంతో ఇక మౌనంగా ఉండటం సరికాదని భావించడం, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంతో ఇటీవల కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి పార్టీ స్థితిగతులపై సమీక్ష నిర్వహించిన విషయం పాఠకులకు విదితమే. తెలంగాణ ఉద్యమానికి ఉమ్మడి పాలమూరు జిల్లాను వేదికగా చేసుకొని ముందుకు సాగినట్లుగానే అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు విధానాలు, పాలమూరు ప్రాజెక్టుల స్థితిగతులను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.
వేగం పెంచిన మాజీలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేసీఆర్ పై చేస్తున్న విమర్శలకు ఎక్కడికక్కడ కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల గెలిచిన సర్పంచులకు సన్మాన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాల రూపకల్పనకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల చివరి వారంలో అచ్చంపేటలో నిర్వహించనున్న సర్పంచుల సన్మాన సభకు కేటీఆర్ హాజరుకానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు కేటీఆర్, హరీష్ రావు తదితర నాయకులు హాజరయ్యే విధంగా మాజీలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రాజెక్టులపై విస్తృత ప్రచారం..
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికే 80 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకుంది. మిగిలిన 15 నుంచి 20 శాతం పనులు పూర్తి చేస్తే సాగు, తాగునీరు సమస్య పూర్తిగా తీరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఆ ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల జరిగే నష్టాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా కేవలం నారాయణపేట-మక్తల్-కొడంగల్ నియోజకవర్గాలకే పరిమితమయ్యేలా కొత్త ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏముంది!?, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తే అన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
భారీ బహిరంగ సభ..
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పరిస్థితులను ప్రజలకు వివరించడంతో పాటు విస్తృత ప్రచారం చేసే విధంగా బీఆర్ఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల పనులు ఏ మేరకు జరిగాయి, ఎన్ని నిధులు ఖర్చు చేశారు, వంటి విషయాలను ప్రజలకు వివరించాలని, వీటితోపాటు రైతు వ్యతిరేక విధానాలను కూడా వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం. జనవరి మొదటి లేదా రెండో వారంలో గాని ఈ సభను నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతలోపు నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను ప్రభుత్వం పై పోరుకు సన్నద్ధం అయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
హాజరుకానున్న కేసీఆర్..
సుదీర్ఘ విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా వేదికగా నిర్వహించనున్న ప్రాజెక్టుల సందర్శన, వాటి స్థితి గతులను అంచనా వేయడం. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఈ సభను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రిజర్వాయర్లు ఉన్న ప్రాంతాల్లో నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన తర్వాత భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. అదే స్థలంలో సభను నిర్వహించే అవకాశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.






