ప్రభుత్వాన్ని ఒప్పించిన పాలమూరు అడ్వకేట్లు

by Ratna Kumari |

అడ్వకేట్ల రక్షణ చట్టం సాధన కోసం మహబూబ్ నగర్ జిల్లా న్యాయవాదులు చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర విజయవంతం కావడం పట్ల మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని ఒప్పించిన పాలమూరు అడ్వకేట్లు
X

దిశ - మహబూబ్ నగర్ : అడ్వకేట్ల రక్షణ చట్టం సాధన కోసం మహబూబ్ నగర్ జిల్లా న్యాయవాదులు చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర విజయవంతం కావడం పట్ల మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. శనివారం బార్ అసోసియేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాదయాత్ర వివరాలను వెల్లడించారు.

ఆగిపోయిన చోటు నుంచే పోరాటం

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర, తొలుత భూత్పూర్ వరకు సాగింది. ఎమ్మెల్యేల హామీ మేరకు అప్పట్లో యాత్రను తాత్కాలికంగా విరమించామని, అయితే క్షేత్రస్థాయిలో ఆ హామీలు నెరవేరకపోవడంతో న్యాయవాదుల ఆత్మగౌరవం కోసం మళ్లీ ఎక్కడైతే ఆగిందో (భూత్పూర్) అక్కడి నుంచే యాత్రను పునఃప్రారంభించినట్లు ఆయన వివరించారు. సుమారు 250 కిలోమీటర్ల మేర కాలి నడకన హైదరాబాద్ సచివాలయం చేరుకున్నామని తెలిపారు. సచివాలయానికి చేరుకున్న తమ సంకల్పాన్ని గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారని అనంతరెడ్డి తెలిపారు. "రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే అడ్వకేట్ల రక్షణ కోసం 'స్పెషల్ యాక్ట్' బిల్లును ప్రవేశపెడతామని సీఎం హామీ ఇచ్చారు. న్యాయవాదులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు" అని పేర్కొన్నారు.

అందరి విజయం

న్యాయవాదులకు భద్రత ఉన్నప్పుడే సామాన్యుడికి న్యాయం అందుతుందని, ఈ విజయం కేవలం మహబూబ్ నగర్ న్యాయవాదులది మాత్రమే కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరిదని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చంద్రమౌళి, గడ్డం గోపాల్, కొప్పుల శ్రీనివాస్, శివానంద, వినోద్ కుమార్, వెంకట్రావు, మురళీకృష్ణ రావు, కాజా పాల్గొన్నారు.

Next Story