'అల్లమురబ్బా' అమ్ముడపోతేనే సగం కడుపు నిండుతుంది బిడ్డా

by Ratna Kumari |

ఈ 'అల్లమురబ్బా' అమ్ముడపోతేనే సగం కడుపు నిండుతది బిడ్డా, లేకుంటే ఉపసమే ఉండాలి అని దీనంగా మొహం పెట్టి చెప్పింది ఆ వృద్ధురాలు.

అల్లమురబ్బా అమ్ముడపోతేనే సగం కడుపు నిండుతుంది బిడ్డా
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఈ 'అల్లమురబ్బా' అమ్ముడపోతేనే సగం కడుపు నిండుతది బిడ్డా, లేకుంటే ఉపసమే ఉండాలి అని దీనంగా మొహం పెట్టి చెప్పింది ఆ వృద్ధురాలు. మహబూబ్ నగర్ బస్టాండ్ లో అల్లమురబ్బా అమ్ముకుంటున్న ఒక వృద్ధురాలు 'దిశ' కంటపడితే పలకరించగా, తన పేరు ఎల్లమ్మ అని, తనకు 70 ఏళ్ల వయసని, తనది నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అని, తనకు 5 మంది బిడ్డలు, ఒక్క కొడుకు ఉండేవాడని, 9 ఏళ్ల క్రితం మొగడు, 10 ఏళ్ల కింద కొడుకు చనిపోయాడని కన్నీటి పర్వంతో చెప్పింది ఎల్లమ్మ. మొగుడు ఉండగానే 5 మంది బిడ్డల పెళ్ళిళ్ళు చేశాడని, నలుగురు కూతుళ్లు వేరే జిల్లాలో ఉంటారని తెలిపింది. తన భర్త చనిపోగానే మొదటి నలుగురు అల్లుళ్ళు అచ్చంపేట లో ఉన్న తన 6 ఎకరాల పొలాన్ని గుంజుకొని తరిమేశారని దీనంగా తెలిపింది.


ప్రస్తుతం మహబూబ్ నగర్ బాలాజీనగర్ లోని రవీంద్ర భారతి స్కూల్ పక్కన చిన్న కూతురు రాధిక ఉంటుందని, చాలా రోజుల క్రితం చిన్న కూతురుని ఆమె మొగుడు కూడా వదలి వెళ్లిపోయాడని, ఆమె ఇంటి పక్కనే 6 ఏళ్లుగా కిరాయికి ఉంటూ బస్ స్టాండ్ లో అల్లమురబ్బా అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మరి తెల్ల రేషన్ కార్డు ఉందా? ఆసరా పెన్షన్ వస్తుందా అని అడుగగా తన పేరు మీద రేషన్ కార్డు ఉందని, కార్డుపై 6 కిలోల బియ్యం వస్తుందని, ఆసరా పెన్షన్ లేదని తెలిపింది ఎల్లమ్మ. మరి అల్లమురబ్బా అమ్మితే ఎంత సంపాదిస్తున్నావని అడుగగా, అమ్ముడపోతే 200 రూపాయల దాకా వస్తుందని, లేకపోతే లేదని, అప్పుడప్పుడు బస్ స్టాండ్ లోని షాపు ల వారు తన అల్లమురబ్బా బుట్టను గుంజుకొని తరిమేస్తుంటారని, కాళ్ళావేళ్ళా బ్రతిమిలాడి తిరిగి తెచ్చుకుంటానని చెప్పింది. ఏదిఏమైనా 70 ఏళ్ల వయసులో బస్ స్టాండ్ లో అల్లమురబ్బా అమ్ముకుంటూ స్వశక్తితో జీవనం కొనసాగిస్తున్న ఎల్లమ్మ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, పాలనా అధికారులు ఎల్లమ్మ దీనావస్థితి చూసి ఆసరా పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Next Story