విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదు : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

by Ratna Kumari |

అధికారులు, ఇతర సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదు :  కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
X

దిశ‌, అయిజ : అధికారులు, ఇతర సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. శుక్రవారం ఐజ పీహెచ్సీ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి వైద్య సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లో సరైన సంతకాలు చేయకపోవడం, లీవ్ లెటర్ ఇవ్వకుండా గైర్హాజరు కావడం, సంతకం పెట్టి విధులు నిర్వహించకుండా వెళ్లిపోవడం వంటి పలు కారణాలతో 9 మందికి షోకాజు నోటీసులు ఇవ్వాలని డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయిను ఫోన్లో ఆదేశించారు. ఒకరిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఓపి రిజిస్టర్ ను పరిశీలించి ప్రతి రోజు సుమారు వందకు పైగా రోగులు చికిత్స నిమిత్తం వస్తున్నందున వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.


ఎన్సీడీ, ఎర్లీ డేట్ అఫ్ డెలివరీ, రిజిస్టర్లను పరిశీలించి రికార్డులను సక్రమంగా నిర్వర్తించాలని అక్కడి వైద్య సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు ఎక్కువగా జరిగేలా అవగాహన కల్పించాలని, సబ్ సెంటర్స్ లోను అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మందుల స్టోర్ లో మెడికల్ కిట్లను పరిశీలించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వార్డులు, ఇతర భవనాల్లో అనవసరమైన ఫర్నిచర్, పాత సామాన్లను వారంలోగా క్లీన్ చేయించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అయిజ పట్టణంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. స్టాక్ రిజిస్టర్ ను, ధరల పట్టికను పరిశీలించారు. రైతులు తమకు కావలసిన ఎరువులను నూతనంగా వచ్చిన యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానంపై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. రైతు భరోసా దరఖాస్తుకు ఈనెల 25 చివరి తేదీ కాబట్టి అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు సహకరించాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఈనెల 22న ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడుతున్నందున రైతు వేదికల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

అలాగే ఐజ లోని లక్ష్మీ శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. నిర్ణీత గడువులోగా గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్న వారికి ఓటీపీ నెంబర్ వస్తుందని, నిబంధనలు పాటించకుండా బుక్ చేసుకుంటే ఉపయోగం లేదని అందుకు గల కారణాలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సంబంధిత ఏజెన్సీ యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రతిరోజు బుకింగ్స్, సిలిండర్ల డెలివరీ, తదితర అంశాల గురించి కలెక్టర్ మాట్లాడారు. వినియోగదారులు అనవసరంగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద బారులు తీరకుండా వారికి అవసరమైన సమాచారాన్ని అందజేసేందుకు హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి స్వామి కుమార్ కు ఆదేశించారు. చివరగా ఐజ కేజీబీవీని సందర్శించిన కలెక్టర్ అక్కడ వంట గదిలో వండిన పదార్థాలను పరిశీలించి, మెనూ ప్రకారం వంటలు చేయకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డార్మెటరీ మరమ్మత్తులు ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, విద్యాలయం అభివృద్ధికి అవసరమైతే అదనపు నిధులను మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందజేస్తున్న ఆహారం, ఇతర సౌకర్యాలపై వాకబు చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే విద్యార్థులు తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

Next Story