- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ వినీత్
దిశ, నారాయణపేట : నూతన సంవత్సరం సందర్భంగా ఆరోజు అర్థరాత్రి నారాయణపేట జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు

దిశ, నారాయణపేట : నూతన సంవత్సరం సందర్భంగా ఆరోజు అర్థరాత్రి నారాయణపేట జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించుకోవడం ప్రతి ఒక్కరి హక్కేనని, అయితే ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అనుమతి లేని వేడుకలు, ర్యాలీలపై నిషేధం
నూతన సంవత్సర వేడుకల పేరుతో జిల్లాలోని ప్రధాన కూడళ్లలో కేకులు కట్ చేయడం, బైక్ ర్యాలీలు నిర్వహించడం, అనుమతి లేకుండా పార్టీలను ఏర్పాటు చేయడం, డీజేలు భారీ సౌండ్ బాక్సులతో శబ్ద కాలుష్యం సృష్టించడం వంటి చర్యలు చట్టరీత్యా నిషేధించబడినవని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ నిషేధాలను ఉల్లంఘించిన వారిపై పోలీస్ పరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు చట్టపరమైన శిక్షలు విధించబడతాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
కుటుంబంతో కలిసి ఇంట్లోనే వేడుకలు .. యువత, తల్లిదండ్రులకు సూచన
జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సరాన్ని తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవంగా, శాంతి యుతంగా జరుపుకోవాలని పోలీసుల తరఫున విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై తగిన పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ప్రజల క్షేమమే పోలీసుల ప్రధాన ధ్యేయమని, యువత క్షేమమే సమాజ భవిష్యత్ అని భావించి ఈ సూచనలు జారీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ, సంతోషాలతో, భద్రతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.






