- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలమూరులో కొత్త రాజకీయ గేమ్ ప్లాన్..! నియోజకవర్గాల పునర్విభజన పైనే నేతల ఆశలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ తప్పనిసరి ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆశావహులు ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ తప్పనిసరి ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఆశావహులు ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనప్రాయంగా ప్రకటనలు వస్తుండడం, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నాయకులు ప్రకటిస్తూ ఉండడం ఆసక్తిని రేపుతోంది. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలవాలని కొంతమంది కొత్త తరం నాయకులు ఆశిస్తూ ఉంటే.. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న వారు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలోని పలు మండలాలు ఒకే నియోజకవర్గంలో ఉంటాయో లేక ఏ నియోజకవర్గంలో చేరుతాయో.. అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్లు అమలు కానున్న నేపథ్యంలో తమకు అవకాశం రాకుంటే తమ కుటుంబ సభ్యులకు అవకాశం దక్కించుకునేందుకు కీలక నేతలు ఇప్పటి నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
నాలుగు అసెంబ్లీ స్థానాలు!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. నారాయణపేట జిల్లాలో కోస్గి లేదా మద్దూరు కేంద్రంగా ఒక నియోజకవర్గం, మహబూబ్ నగర్ రూరల్, అమరచింత లేదా కొత్తకోట లేదా పెబ్బేరు లలో ఒక నియోజకవర్గం, జోగులాంబ గద్వాల జిల్లా ఐజ కేంద్రంగా ఒక నియోజకవర్గం, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆమనగల్ మరో నియోజకవర్గంగా మొత్తం నాలుగు నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. పార్లమెంట్ స్థానాలు పెరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతమున్న రెండు స్థానాలకు అదనంగా ఒకటి లేదా రెండు స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది
ఇప్పటి నుంచి అడుగులు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఆశావహులు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్ టౌన్, రూరల్ నియోజకవర్గాలపై ఎక్కువమంది నేతలు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు అవకాశం ఉంటే తప్పకుండా రంగంలో ఉండాలనే ఆలోచనలతో కొంతమంది నేతలు అడుగులు వేస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా ఉన్న సురేందర్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ కార్యదర్శి మిథున్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త జీవన్ రెడ్డి ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి అవకాశం లభిస్తే పోటీ చేసేందుకు మాజీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ ఆసక్తితో ఉన్నారు. జడ్చర్ల, మహబూబ్ నగర్, నారాయణపేట నియోజకవర్గాలలో ఒక దాని నుంచి పోటీ చేసేందుకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సన్నద్ధమవుతున్నారు. నియోజకవర్గాలు పెరిగిన ఎడల పోటీలో ఉండాలి అని నారాయణపేట మాజీ ఎంపీపీ అమ్మ కోళ్ల శ్రీనివాసరెడ్డి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయిజ కొత్త నియోజకవర్గం జనరల్ స్థానంగా ఏర్పడితే గద్వాలలో నువ్వా నేనా అన్నట్లుగా అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య లలో సరిత తిరుపతయ్యకు అక్కడ అవకాశం ఇవ్వచ్చు అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. మిగిలిన నియోజకవర్గాలలో ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పోటీ చేసే యోచనలలో నియోజకవర్గాలలో తిరుగుతున్నారు.
మహిళలకు కేటాయిస్తే..
ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు, నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏర్పడే కొత్త నియోజకవర్గాలలో కొన్ని నియోజకవర్గాలు మహిళా రిజర్వేషన్ల ప్రకారం రిజర్వు అయితే తమ కుటుంబ సభ్యులను పోటీలో నిలిపేందుకు ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే పాచికలు కదుపుతున్నారు. కార్యక్రమాలకు అడపాదడపా తమ సతీమణులను తీసుకు వెళుతున్నారు. మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనకపోయినా వారి కుటుంబ సభ్యులే కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. అప్పటి పరిస్థితులు ఎలా వచ్చినా.. వాటిని తమకు అనుకూలంగా మలుచుకునే విధంగా నాయకుల అడుగులు పడుతున్నాయి. మొత్తంపై ముందు చూపుతో అడుగులు వేస్తున్న ఆశావాహుల్లో ఎవరికి అవకాశాలు వస్తాయి.. ఎవరికి రావు అన్న అంశాలు తేలడానికి చాలా సమయం ఉన్నప్పటికీ ఆశావాహులు మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఉన్నారు.






