కొత్త కలెక్టర్లు.. పాత సమస్యలు..!

by Jakkula.Mamatha |   (  Updated:2026-03-02 03:41:14  IST  )

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు జిల్లాలకు వచ్చిన కొత్త కలెక్టర్లకు పాత సమస్యలు సవాళ్లు విసురుతూ స్వాగతం పలికాయి.

కొత్త కలెక్టర్లు.. పాత సమస్యలు..!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు జిల్లాలకు వచ్చిన కొత్త కలెక్టర్లకు పాత సమస్యలు సవాళ్లు విసురుతూ స్వాగతం పలికాయి. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్‌గా కుష్బూ గుప్త, నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్ జైన్, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్ బాధ్యతలు స్వీకరించిన విషయం పాఠకులకు విధితమే.. కొత్తగా వచ్చిన కలెక్టర్లు ఆయా జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అని అటు అధికారులు.. ఇటు అక్రమ వ్యాపారులలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక, మట్టి అక్రమ రవాణ అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. మరోవైపు మట్టి దందాను పట్టించుకునే వారే లేకుండా పోయారు.

ప్రధానంగా నారాయణపేట జిల్లా కృష్ణ, మాగనూరు, మక్తల్, ఊట్కూరు, కోస్గి, మద్దూరు, కొత్తపల్లి మండలాలలో ఇసుక, మట్టి దోపిడీ పెద్ద ఎత్తున సాగుతోంది. అక్రమ వ్యాపారులకు అండదండలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో అక్రమ వ్యాపారం రోజురోజుకు జోరందుకుంటుంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లోని పలు మండలాలతో పాటు, కోయిలకొండ మండలం నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ , గద్వాల నియోజకవర్గాల్లోనూ మట్టి, ఇసుక దందాలను అరికట్టే పరిస్థితులు లేకుండా పోయాయి. ఈ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, సీడు దందాలు అక్రమార్కులను కోటీశ్వరులను చేస్తున్నాయి. పలు చోట్ల కల్తీ మద్యం, కల్తీ కల్లు వ్యాపారాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి.

నిఘాను నీరుగారుస్తున్న ‘ఇంటి దొంగలు’

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారుల్లో కొంతమంది అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారు. పత్రికలు, మీడియాలలో కథనాలు వచ్చాయంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని బృందాలు తనిఖీలకు వెళ్లి నివేదికలను అందజేయవలసి ఉంటుంది. కానీ ఈ సమాచారాన్ని ఇంటి దొంగలు అక్రమ వ్యాపారులకు ముందుగానే చేరవేసి మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ వ్యవహారాల వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట పడేనా?

ఆయా జిల్లాల కలెక్టర్లు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి సారించడమే కాకుండా అక్రమ దందాలపై ఉక్కుపాదం మూవీ ప్రకృతి వనరులను కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. కొత్త కలెక్టర్లు పాత సమస్యలపై దృష్టి సారించి అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్టలు వేస్తారా..!? లేదా అన్నది కొన్నాళ్లలో తేలనుంది. ఉమ్మడి జిల్లాలోని కొత్త, పాత కలెక్టర్లు అక్రమ దందాలపై ప్రత్యేక దృష్టి సారించి దోపిడీ వ్యవస్థను రూపుమాపాలని ప్రజలు కోరుతున్నారు.

రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ కీలక భేటీ.. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’పై దిశానిర్దేశం

Next Story