పేదవాడి 'మెతుకు' కార్డుపై అధికారుల నిర్లక్ష్యం

by Nallavelli.Anjaneyulu |

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వందలాదిమంది నిరుపేదల ఆశలు అడియాశలవుతున్నాయి.

పేదవాడి మెతుకు కార్డుపై అధికారుల నిర్లక్ష్యం
X

దిశ, ఇటిక్యాల : కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వందలాదిమంది నిరుపేదల ఆశలు అడియాశలవుతున్నాయి. గత పది ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు దేవుడు కరుణించిన కానీ అధికారులు కనికరించరన్న అపవాదిని రెవెన్యూ అధికారులు మూటగట్టుకుంటున్నారు. రేషన్ కార్డు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు నెలలు తరబడి రేషన్ కార్డుల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి కార్యాలయాల్లో ఫైళ్లు కదలాలంటే 'చేతులు తడవాల్సిందే' అన్న విమర్శలు కార్యాలయ వెలుపల్లో వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు తీరు దారుణంగా ఉంది. అర్హులైన నిరుపేదలు మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకుని నెలలు గడుస్తున్నా, అవి నేటికీ ఎమ్మార్వో లాగిన్‌లలోనే మూలుగుతున్నాయి. విచారణ పేరుతో కాలయాపన చేయడం, సాంకేతిక కారణాలు చెప్పి దరఖాస్తులను తిరస్కరించడం అధికారులకు పరిపాటిగా మారింది.


జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎమ్మార్వో కార్యాలయంలో సిబ్బంది అవినీతి అవతారమెత్తిన 'అప్రూవల్' కొందరు అధికారులు, సిబ్బంది పేదవాడి ఆకలిని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. అర్హత ఉన్నా సరే, రేషన్ కార్డు ఆమోదం పొందాలంటే మధ్యవర్తుల ద్వారా వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. "డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని లేదంటే ఫైల్ పెండింగ్‌లో ఉంటుందనే ధోరణి ఎమ్మార్వో ఆఫీసుల్లో బహిరంగ రహస్యంగా మారింది. లంచం ఇచ్చుకోలేని నిరుపేదలు ప్రభుత్వ పథకాలకు దూరమై తీవ్రంగా నష్టపోతున్నారు. కార్యాలయానికి వెళ్లిన ప్రజలకు అధికారులు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. సర్వర్ డౌన్ అని ఒకరు, పై అధికారులు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదని ఒకరు తమ దగ్గర ఏమి పెండింగ్ లేదు అంతా జిల్లా స్థాయిలోనే ఉందని మరొకరు సాకులు చెబుతూ తమ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం తప్ప, క్షేత్రస్థాయిలో ఒక నిరుపేదకు రేషన్ కార్డు ఎందుకు అందడం లేదన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. రేషన్ కార్డు కేవలం బియ్యం కోసమే కాదు, అది ఒక నిరుపేద కుటుంబానికి ఆరోగ్య శ్రీ , ఇతర ప్రభుత్వ పథకాలకు ప్రధాన ఆధారం. కార్డు మంజూరులో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరుతాయని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Next Story