50 ఏళ్ల విద్యా నిలయంపై పాలకుల నిర్లక్ష్యం.. ఎస్సీ హాస్టల్‌కు దిక్కెవరు?

by Ajay Maddhiboyina |

నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై విద్యార్థుల అడ్మిషన్లు కొనసాగుతున్నా ధన్వాడ ఎస్సీ హాస్టల్ భవనం భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. శిథిలావస్థకు చేరుకున్న హాస్టల్ భవనాన్ని పరిశీలించిన జిల్లా యంత్రాంగం విద్యార్థుల భద్రత దృష్ట్యా వెంటనే ఖాళీ చేయించాలని నిర్ణయించింది.

50 ఏళ్ల విద్యా నిలయంపై పాలకుల నిర్లక్ష్యం.. ఎస్సీ హాస్టల్‌కు దిక్కెవరు?
X

దిశ, ధన్వాడ: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై విద్యార్థుల అడ్మిషన్లు కొనసాగుతున్నా ధన్వాడ ఎస్సీ హాస్టల్ భవనం భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు. శిథిలావస్థకు చేరుకున్న హాస్టల్ భవనాన్ని పరిశీలించిన జిల్లా యంత్రాంగం విద్యార్థుల భద్రత దృష్ట్యా వెంటనే ఖాళీ చేయించాలని నిర్ణయించింది. దీనికోసం స్థానికంగా పలు భవనాలను పరిశీలించినా ఏదీ అనుకూలంగా లేకపోవడంతో చివరకు హాస్టల్‌ను నారాయణపేటకు తరలించే దిశగా అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. రేపో మాపో తరలింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనిస్తుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది.

ఐదు దశాబ్దాల చరిత్ర...

ధన్వాడలో దాదాపు 50 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఎస్సీ హాస్టల్‌లో చదువుకుని, నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు ఎంతో మంది ఉన్నారు. చుట్టుపక్కల అనేక మండలాల నుంచి నిరుపేద, దళిత విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. అయితే, కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరింది. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని స్థితిలో భవనం తయారైంది. విద్యార్థుల రక్షణ దృష్ట్యా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ప్రత్యామ్నాయ భవనాల కోసం వెతకడం ప్రారంభించారు. కానీ, రెండు నెలలుగా అధికారులు వస్తున్నారు.. పోతున్నారు తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు.

అంగీకరించని సర్కారు అద్దె..

స్థానికంగా అపోలో ఫార్మసీ పై అంతస్తులో ఉన్న పది షెటర్లను తాత్కాలిక హాస్టల్ కోసం అధికారులు పరిశీలించారు. అంతా బాగుంది అనుకునే సమయానికి అద్దె వ్యవహారం అడ్డంకిగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన అద్దె ధర చాలా తక్కువగా ఉండటంతో, భవన యజమాని గదులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆ ప్రయత్నం కాస్తా రద్దయింది. స్థానికంగా మరో భవనం దొరకలేదనే సాకుతో అధికారులు ఇప్పుడు ఈ హాస్టల్‌ను నారాయణపేటకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపో మాపో ఇక్కడి సామాగ్రిని తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు.

లీడర్లు ఉన్నా.. ఫలితం శూన్యం!

బడా రాజకీయ నాయకులు ధన్వాడలో ఎంతో మంది ఉన్నా, కనీసం ఈ హాస్టల్‌ను స్థానికంగా ఉంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో ఒక హాస్టల్ కోసం కనీసం ఒక అద్దె భవనాన్ని కూడా సర్దుబాటు చేయలేకపోవడం పాలకుల చేతకానితనానికి అద్దం పడుతోందని గ్రామస్తులు దుయ్యబడుతున్నారు.

అడ్మిషన్లకే భయం.. విద్యార్థుల విలవిల!

హాస్టల్ ఎప్పుడు ఎక్కడికి తరలిపోతుందో తెలియని అయోమయ స్థితి నెలకొనడంతో కొత్తగా చేరాల్సిన విద్యార్థులు భయపడిపోతున్నారు. నిన్నటి వరకు కేవలం ఒకరిద్దరు మాత్రమే అడ్మిషన్ల కోసం వచ్చినట్లు సమాచారం. నారాయణపేటకు తరలిస్తే దూరాభారం పెరిగి పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక నిధుల ద్వారా అద్దె వ్యత్యాసాన్ని భరించో, లేదా మరో ప్రత్యామ్నాయాన్ని చూపో హాస్టల్‌ను ధన్వాడలోనే కొనసాగించాలని విద్యార్థి సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story