నేడే మున్సిపల్ సమరం..

by velandi.Saikiran |   (  Updated:2026-02-10 21:15:15  IST  )

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పుర పోరు క్లైమాక్స్‌కు చేరింది. పట్టణ ఓటరు నాడి ఎటుందో.. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయ్యే సమయం ఆసన్నమైంది.

నేడే మున్సిపల్ సమరం..
X

నేడే మున్సిపల్ సమరం..

- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 పురపాలికలు, ఒక కార్పొరేషన్‌లో పోలింగ్

- ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయనున్న ఓటర్లు

- బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ప్రజలు

- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం.. పటిష్ట బందోబస్తు

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పుర పోరు క్లైమాక్స్‌కు చేరింది. పట్టణ ఓటరు నాడి ఎటుందో.. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయ్యే సమయం ఆసన్నమైంది. గత కొద్ది రోజులుగా గల్లీ గల్లీలో సాగిన రాజకీయ సందడికి తెరపడి, బుధవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ సమరం ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ సహా జిల్లాలోని 18 మున్సిపాలిటీల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో గెలిచి, మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగురుతుందా? లేక ప్రతిపక్షాలు పాగా వేస్తాయా? అన్నది ఉత్కంఠగా మారింది. అధికారుల ఏర్పాట్లు, పోలీసుల పహారా మధ్య నేడు సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ నగారా మోగింది. గత పది రోజులుగా సాగిన హోరాహోరీ ప్రచారం, ర్యాలీలు, సవాళ్లు, ప్రతిసవాళ్లకు తెరపడగా.. బుధవారం అసలైన ‘ఓటు’ యుద్ధం జరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా 18 మున్సిపాలిటీల్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే కీలక ఘట్టం నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

జిల్లాల వారీగా ఎన్నికల సమరం ఇలా..

మహబూబ్ నగర్ జిల్లా:

జిల్లాలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మహబూబ్ నగర్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లకు గాను 1,97,841 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. వీటితో పాటు దేవరకద్ర మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 10,070 మంది, భూత్పూర్ మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 12,064 మంది ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా:

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 65 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్‌లో 24 వార్డులకు (35,378 మంది ఓటర్లు), కల్వకుర్తిలో 22 వార్డులకు (26,034 మంది), కొల్లాపూర్‌లో 19 వార్డులకు (19,470 మంది) ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

వనపర్తి జిల్లా:

వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వనపర్తి (33 వార్డులు - 64,190 ఓటర్లు), పెబ్బేరు (12 వార్డులు - 14,333 ఓటర్లు), కొత్తకోట (15 వార్డులు - 18,192 ఓటర్లు), అమరచింత (10 వార్డులు - 9,147 ఓటర్లు), ఆత్మకూరు (10 వార్డులు - 11,579 ఓటర్లు) లో పోలింగ్ కు రంగం సిద్ధమైంది.

జోగులాంబ గద్వాల జిల్లా:

జిల్లాలో గద్వాల మున్సిపాలిటీ పెద్దది కావడంతో 37 వార్డుల్లో 65,282 మంది ఓటు వేయనున్నారు. ఐజలో 20 వార్డుల్లో 23,016 మంది, వడ్డేపల్లిలో 10 వార్డుల్లో 10,604 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, అలంపూర్ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో, మిగిలిన 9 వార్డుల్లో 9,622 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.

నారాయణపేట జిల్లా:

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. నారాయణపేటలో 24 వార్డులకు (35,460 మంది ఓటర్లు), మక్తల్‌లో 16 వార్డులకు (20,248 మంది), కోస్గిలో 16 వార్డులకు (23,345 మంది), మద్దూరులో 16 వార్డులకు (12,701 మంది) ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు.

భద్రత కట్టుదిట్టం..

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో తరలించడంతో పాటు, సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story