- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాఫిక్ పోలీసుల ఫైన్లతో వాహనదారుల బెంబేలు..!
దిశ, కందనూల్ : ట్రాఫిక్ పోలీసులు వాహదారులకు దారుణంగా చలాన్ లు వేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ద్విచక్ర

దిశ, కందనూల్ : ట్రాఫిక్ పోలీసులు వాహదారులకు దారుణంగా చలాన్ లు వేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ద్విచక్ర వాహనదారులు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను ఎక్కించుకుని స్కూలుకు దించేందుకు వెళ్ళాడు. ఇంటికి వచ్చి చూసుకుంటే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రూ.1000 ఫైన్ వేస్తున్నట్లు సెల్ ఫోనుకు సందేశం పంపించారు. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. తాను ఏమీ తప్పు చేసాను.. స్కూలు బస్సులకు ఫీజులు కట్టలేక తాము తమ వాహనాలపై పిల్లలను ఎక్కించుకుని పోవడం కూడా తప్పేనా అంటూ వేల రూపాయల ఫైన్లు వేయడమేంటని ప్రశ్నించారు. ఏమీ చేయలేని స్థితిలో ఆ ఫోటోతో పాటు తన వాయిస్ మెస్సేజిలో తన బాధను రికార్డు చేసి పట్టణంలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ద్విచక్ర వాహనదారుల్లో చాలా మంది ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ ట్రాఫిక్ పోలీసు వచ్చి ఫోటో తీసి ఫైన్ వేస్తారోనని భయపడిపోతున్నారు. సాధారణ పోలీసుల కంటే ట్రాఫిక్ పోలీసులే పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద దర్శనమిస్తున్నారు. ఫోటో తీసి ఫైన్ల కోసం అప్లోడ్ చేయడమే వారి పనిగా పెట్టుకున్నారు. ట్రాఫిక్ ఫైన్లకు టార్గెట్లు పెట్టారన్న కారణంగా ట్రాఫిక్ పోలీసు సిబ్బంది యాడాపెడాగా వాహనాలకు ఫైన్లు వేస్తుండటంతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రజలు చిర్రెత్తుకుపోతున్నారు. స్కూలుకు పిల్లలను తీసుకెళ్తుంటే కూడా ఫోటో తీసి త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ పేరుతో ఫైన్లు వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా బస్టాండుకు వచ్చే ప్రయాణీకుల బైకులకు కూడా ఫోటో తీసి ఫైన్ వేస్తున్నారని చెబుతున్నారు.
నాగర్ కర్నూల్ పట్టణంలో ఉన్న ఒకే ఒక్క ప్రధాన రహదారిపైనే పట్టణ ప్రజలంతా ఏదో ఒక పనిపై ప్రయాణిస్తుంటారు. ఎదో ఒక కారణంతో ఫైన్లు పడుతుండటంతో ద్విచక్ర వాహనదారులు విసుగెత్తిపోతున్నారు. అధిక ప్రయాణీకులను ఎక్కించుకుని గ్రామాలకు తరలించే ఆటోలు, జీపులపై ఎన్నడూ ఫైన్లు వేయని ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలపై ఎందుకు ఫైన్లు వేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా పట్టణంలోని ప్రధాన రహదారితో పాటు నల్లవెల్లి రోడ్డు, నాగనులు, శ్రీపురం రహదారుల్లో కూడా షాపింగ్ కాంప్లెక్స్, దుకాణ సముదాయాల ముందు వాహనాలు పార్కింగ్ చేసే స్థలం లేక వివిధ పనులపై కొనుగోళ్ళకు వచ్చే వాహనదారులు షాపుల ముందు వాహనాలు నిలుపుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సిబ్బంది ఫోటోలు తీసి ఫైన్లు వేసేస్తున్నారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాపుల నిర్మాణాల సమయంలో వాహనాలు నిలిపే స్థలం లేకున్నా అనుమతులు ఎందుకు ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముందు రహదారులు సరిగ్గా ఉంచి, వాహనాల పార్కింగుకు స్థలాలు ఉంచి తర్వాత ఫైన్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు.






