అన్ని వసతులతో నూతన కోర్టు భవన నిర్మాణం.. Minister Srinivas Reddy

by Javid Pasha |   (  Updated:2022-12-26 14:35:19  IST  )

అన్ని వసతులతో మహబూబ్ నగర్ లో నూతన కోర్టు భవన సమూదాయాన్ని నిర్మిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

అన్ని వసతులతో నూతన కోర్టు భవన నిర్మాణం.. Minister Srinivas Reddy
X

దిశ, మహబూబ్ నగర్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జిల్లా కోర్టు భవన సముదాయాన్ని అన్ని వసతులతో నిర్మించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్క్రతిక శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్ర సమీపంలోని బండమీదిపల్లిలో కేటాయించిన 10 ఎకరాల స్ధలాన్ని సోమవారం అధికారులు, బార్ అసోషియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 20 ఏళ్ళ నుండి సరియైన వసతులు లేక పాత కోర్టు భవనంలో న్యాయవాదులు, జడ్జీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ విషయం తనకు తెలియగానే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు కోసం నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. అందులో భాగంగా రాయిచూర్ రహదారి ప్రక్కనే సువిశాలమైన స్థలంలో 16 కోర్టులు ఒకే చోట ఉండేలా అన్ని హంగులతో విశాల భవన సమూదాయాన్ని నిర్మిస్తామని ఆయన తెలిపారు.

ఈ నూతన కోర్టు భవనానికి 3 ప్రధాన రహదారులు అనుసంధానంగా ఉంటాయని, 5 నిమిషాలలో నూతన కోర్టు కార్యాలయానికి చేరుకోవచ్చని వెల్లడించారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మెన్ నర్సింహులు, సీనియర్ న్యాయవాదులు ప్రతాప్ కుమార్, పీపీలు బెక్కెం జనార్ధన్, స్వదేష్ కుమార్, ప్రభుత్వ ప్లీడర్ మనోహర్, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, లక్ష్మారెడ్డి, మురళీకృష్ణ, హనుమంతు, ఉమామహేశ్వరి, న్యాయవాదులు తదితరులు ఉన్నారు.

Next Story