- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమైనది: మంత్రి జూపల్లి కృష్ణారావు
1200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: 1200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ఈనెల 17 న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నట్లు, ఈ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమైనదని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి లతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శనివారం జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి సుమారు 1200 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఐఐఐటి కళాశాల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, శాశ్వత తాగునీటి సరఫరా, ఎంవిఎస్ కళాశాల భవన నిర్మాణం వంటి అత్యంత కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
పారిశుధ్య చర్యలు, భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చ..
అనంతరం జరిగే సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. సభాప్రాంగణం, వేదిక ఏర్పాట్లు, రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, పారిశుధ్య చర్యలు, భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను కోరారు.
మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు..
సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు సమర్పించగా, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశం అనంతరం, ఐఐఐటి కళాశాల నిర్మాణం చేపట్టనున్న చిట్టబోయినపల్లి ప్రాంతాన్ని, అలాగే ముఖ్యమంత్రి సభ నిర్వహించనున్న ఎంవిఎస్ కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సమావేశం లో ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్ నాయక్, ఆర్డీఓ నవీన్, జిల్లా పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






