రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు

by velandi.Saikiran |

ఏళ్ల తరబడి భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు.

రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు
X

దిశ, కొల్లాపూర్ : ఏళ్ల తరబడి భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు. అటవీ, రెవెన్యూ శాఖల పరిధిలోని భూ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మండి పడ్డారు. గురువారం కొల్లాపూర్ మండలం సోమశిలలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైతుల భూ సమస్యలపై అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఒక్కో సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. అవి పరిష్కారానికి నోచుకోకపోవడానికి గల కారణాలపై మంత్రి ఆరా తీశారు.అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో రైతులు నష్టపోకూడదని మంత్రి స్పష్టం చేశారు.

వివాదాస్పద భూములపై ఇరు శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి, భూ రికార్డులు, అటవీ సరిహద్దులు, రైతుల ఆధీనంలోని భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు.నిబంధనల పరిధిలో పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని, ప్రతి సమస్యపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. రైతులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పితే సహించేది లేదని, సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర,ఆర్డీఓ బన్సీలాల్, డివిజనల్ అటవీ శాఖ అధికారి చంద్ర శేఖర్, సర్పంచ్ కాటం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story