80.9 శాతానికి పెరిగిన భారతదేశ అక్షరాస్యత రేటు

by Malleboina Mahesh |

భారతదేశ అక్షరాస్యత రేటు 80.9 శాతానికి పెంపు.. 98.2 శాతంతో మిజోరాం టాప్.. 72.6 శాతంతో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానం!

80.9 శాతానికి పెరిగిన భారతదేశ అక్షరాస్యత రేటు
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలు, అక్షరాస్యతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ రకాల విద్యా సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) నిర్వహించిన తాజా ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ (PLFS) వార్షిక నివేదిక ప్రకారం.. భారతదేశ సగటు అక్షరాస్యత రేటు (Overall India Literacy Rate) గణనీయంగా మెరుగై 80.9 శాతానికి చేరుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న 74 శాతం అక్షరాస్యత తో పోలిస్తే.. దేశంలో విద్యావ్యాప్తి ఎంతో వృద్ధి చెందిందని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. అయితే, ఈ నివేదికలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఇప్పటికీ వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు అత్యధికంగా 90 శాతంగా నమోదు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది కేవలం 77 శాతంగానే నమోదైంది.

రాష్ట్రాల వారీగా అక్షరాస్యత గణాంకాలను పరిశీలిస్తే.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం 98.2 శాతం అక్షరాస్యతతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాతి స్థానాల్లో కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ (97.3%), నాగాలాండ్ (95.7%), కేరళ (95.3%) నిలిచాయి. కాగా, దేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత రేటుతో ఆంధ్ర ప్రదేశ్ (72.6%) చివరి స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ తర్వాత స్థానాల్లో బీహార్ (74.3%), మధ్యప్రదేశ్ (75.2%), రాజస్థాన్ (75.8%) ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం 76.9 శాతం అక్షరాస్యతను నమోదు చేసింది.

Next Story