బీఆర్ఎస్ హయాంలోనే తాడిచర్ల హక్కుల సాధన : కొప్పుల ఈశ్వర్

by Naga Rani Yarlagadda |

సింగరేణిని కాపాడుకోవడం ప్రజల హక్కు అని.. కేసీఆర్ ఆలోచనలతో సింగరేణి బలోపేతమైందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

బీఆర్ఎస్ హయాంలోనే తాడిచర్ల హక్కుల సాధన : కొప్పుల ఈశ్వర్
X
  • కాంగ్రెస్, బీజేపీ ఘనతగా చెప్పుకోవడం సరికాదు
  • బొగ్గు మాయం స్కామ్‌లో దోషులను తేల్చాలి
  • మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణిని కాపాడుకోవడం ప్రజల హక్కు అని.. కేసీఆర్ ఆలోచనలతో సింగరేణి బలోపేతమైందని.. అనేక పోరాటాల తర్వాత తాడిచర్లపై అప్పుడే హక్కులు సాధించుకున్నామని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తాడిచర్ల ఘనత తమదని కాంగ్రెస్, బీజేపీ చెప్పుకోవడం కరెక్టు కాదన్నారు. 13 ఏండ్ల నిరీక్షణ తర్వాత తాడిచర్ల సింగరేణి దక్కిందని.. గతంలో ఈ బ్లాక్‌ను వేలం వేద్దామంటే కేసీఆర్ వ్యతిరేకించారని చెప్పారు. సెక్షన్ 17 ఏ ప్రకారం గతంలో పలు బ్లాక్‌లను వేలం వేయకూడదని కేసీఆర్ ప్రధానికి ఉత్తరం రాసినా కేంద్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఆనాడు బ్లాక్‌లు సింగరేణికి దక్కకపోవడానికి కేంద్రమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పోటీపడి తాడిచర్లను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం హాస్యాస్పదమన్నారు. ఎంఎండీఆర్ యాక్ట్‌కు మార్పులు తెచ్చి గనులు వేలం వేయడానికి కాంగ్రెస్ బీజేపీలే కారణమని ఆరోపించారు.

సింగరేణిలో అనేక స్కాంలను తమ నేత హరీశ్‌రావు బయటపెట్టారని.. బొగ్గు మాయం స్కాంలో దోషులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. సింగరేణిని బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. గనుల వేలానికి సంబంధించిన ఎంఎంటీఆర్ బిల్లును తాను ఎంపీగా వ్యతిరేకించానని.. బొగ్గు బావులను వేలం వేయొద్దని ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి కుంభకోణాలకు అడ్డగా మారిపోయిందన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో ఓబీ టెండర్‌లో కుంభకోణం చేశారని.. 42 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు పేరిట రూ.16 వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో సింగరేణిలో మొత్తం 16 వేల కోట్ల కుంభ కోణాలు జరిగాయని పేర్కొన్నారు. ఈ కుంభకోణాలపై సీబీఐ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి కిషన్‌రెడ్డికి ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు.

Next Story