రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి: మంత్రి దామోదర రాజనరసింహ

by Kodari Anjali |

ఎల్ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పని చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు.

రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి: మంత్రి దామోదర రాజనరసింహ
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: ఎల్‌ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణకు నాంది కావాలని, ఉమ్మడి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మిషన్ మోడ్‌లో పనిచేయాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో ఉమ్మడి జిల్లాలో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజల ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసి, వాటి ప్రభావాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ఒకే లక్ష్యంతో పనిచేస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజాప్రతినిధుల సూచనలను గౌరవిస్తూ, క్షేత్రస్థాయిలో రైతులకు ధైర్యం, భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో‌ ప్రభావాన్ని ప్రజలపై పడనీయొద్దని, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పశుసంవర్ధకం సహా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉంటూ జూలై 31 నాటికి శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ప్రణాళికతో పనిచేస్తేనే ఎల్‌నినో ప్రభావాన్ని..

రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎల్‌నినో కంటింజెన్సీ సమీక్ష సమావేశంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పరిస్థితులను శాఖల వారీగా మంత్రి సమీక్షించగా, ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో సాధారణంగా ఈ సమయానికి నమోదు కావాల్సిన వర్షపాతం తో పోలిస్తే సుమారు 40 శాతం లోటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి శాఖ ముందస్తు ప్రణాళికతో పనిచేస్తేనే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా తగ్గించగలమన్నారు. ఎల్‌నినో అంటే ఏమిటి, దాని ప్రభావం ప్రజల జీవితాలపై, వ్యవసాయంపై ఎలా ఉంటుందో గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అనవసర ఆందోళన కలగకుండా శాస్త్రీయ సమాచారం అందించాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా నది జలాలపైనే ఆధారపడి ఉన్నాయని, కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నిండిన తర్వాతే దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం వచ్చే పరిస్థితి ఉంటుందని అధికారులు మంత్రికి వివరించారు.

ఉద్యానవన శాఖలు సమన్వయంతో..

మంత్రి స్పందిస్తూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత సమర్థంగా వినియోగిస్తూ తాగునీటికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పనిచేయని హ్యాండ్‌పంపులు, బోర్లను వెంటనే మరమ్మతు చేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు శాస్త్రీయ సూచనలు అందించాలని మంత్రి ఆదేశించారు. అధిక నీటి అవసరం ఉండే పంటలకు బదులుగా తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో పూర్తయ్యే పూలు, ఉద్యాన పంటలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు విత్తనాలు, సాంకేతిక సలహాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు చేపట్టాలని, అవసరమైతే సాధారణ పరిస్థితుల కంటే ఎక్కువ రోజులు ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించాలని..

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని, వ్యవసాయం, తాగునీటి అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర వైద్య సామగ్రి అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధుల నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు, క్లోరినేషన్, ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించాలని, జిల్లా కేంద్రంలో ఒక కంట్రోల్ రూమ్ ను, టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు వెంటనే చేపట్టే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. జూలై 31 నాటికి అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలు, అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని, వాటి అమలుకు అవసరమైన అదనపు బడ్జెట్ కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇది మనుషులు సృష్టించిన సంక్షోభం కాదని, ప్రకృతి తెచ్చిన సవాల్ అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఈనెల 24 న సమీక్ష సమావేశం...

ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించి ఈ నెల 24 న శుక్రవారం ఉదయం 10 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల అధికారులతో మరో సమీక్ష నిర్వహించి జిల్లాల వారీగా కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఆర్ డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్యశాఖ ల అధికారులు సమగ్ర వివరాలతో సమావేశానికి హాజరు కావాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్, ఎల్ నినో ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మెన్ జి. చిన్నారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ షఫీఉల్లా, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, వీరంపల్లి శంకర్, విజయుడు, తదితర ప్రజాప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లైన ఖుష్బూ గుప్తా, ఆదర్శ సురభి, సిహెచ్ ప్రియాంక, షేక్ రిజ్వాన్ భాషా, హేమంత్ కేశవ్ పాటిల్, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మెన్ శివసేనారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మెన్ సరిత, మహబూబ్ నగర్ నగర పాలక మేయర్ మమత శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాల మున్సిపల్ చైర్మన్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొని శాఖలవారీగా ప్రస్తుత పరిస్థితులను, భవిష్యత్ కార్యాచరణను మంత్రికి వివరించారు.

Next Story