కృష్ణానదిపై మినీ బ్యారేజ్..ఏకంగా రూ.700 కోట్లతో !

by velandi.Saikiran |   (  Updated:2026-05-25 22:16:07  IST  )

తెలంగాణ... కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై మినీ బ్యారేజ్ నిర్మాణం కోసం ఇరు రాష్ట్రాల మంత్రులు,. ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సోమవారం హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం జరిగింది.

కృష్ణానదిపై మినీ బ్యారేజ్..ఏకంగా రూ.700 కోట్లతో !
X

కృష్ణానదిపై మినీ బ్యారేజ్

- కొల్పూరు - కొడితి కొండ మధ్య రూ.700 కోట్లతో ప్రతిపాదన

- తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల గ్రీన్ సిగ్నల్!

- సచివాలయంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ

- పాలమూరు, రాయచూరు జిల్లాలకు తీరనున్న నీటి కష్టాలు

- జూరాలకు 3 టీఎంసీల నీటిని ఇవ్వాలని కర్ణాటకకు విజ్ఞప్తి

- జూరాల ప్రాజెక్టు సామర్థ్యం పెంచే దిశగా ఇరు రాష్ట్రాల కీలక అడుగు!?

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ... కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై మినీ బ్యారేజ్ నిర్మాణం కోసం ఇరు రాష్ట్రాల మంత్రులు,. ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సోమవారం హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం జరిగింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, యువజన సర్వీసులు క్రీడలు మత్స్య శాఖ మంత్రి శ్రీహరి, కర్ణాటక మైనర్ ఇరిగేషన్ మంత్రి బోస్ రాజ్ మధ్య హైదరాబాద్ లోని భేటీ అయ్యారు. మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, కర్ణాటక రాయచూర్ ఎంపీ కుమార్ నాయక్, సంబంధిత శాఖల అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాల మినీ బ్యారేజీ నిర్మించాలన్న ఇరు రాష్ట్రాల నిర్ణయంలో భాగంగా ఈ భేటీ జరిగింది.

కొల్పూరు- కొడితి కొండ మధ్య మినీ బ్యారేజ్

వర్షాకాలంలో కృష్ణానది జలాలు కిందకు వృథాగా వెళ్లకుండా ఉండేందుకు , ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా బ్యారేజీ నిర్మించాలన్న ఒప్పందానికి వచ్చారు. 0.5 టీఎంసీల కెపాసిటీతో ఈ బ్యారేజీని నిర్మించాలని ఇరు రాష్ట్రాల మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతూ వచ్చాయి. కర్ణాటకలోని రాయచూరు, తెలంగాణలోని కృష్ణ, మాగనూరు, మక్తల్ మండలాలకు సాగునీరు, తాగునీటి సమస్య లేకుండా చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కారణంగానే రెండు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమీక్ష సమావేశం జరిగింది. బ్యారేజీ నిర్మాణం వల్ల లాభనష్టాలను ఉదాహరణలతో బేరీజు వేశారు. దాదాపుగా 700 కోట్ల రూపాయలతో ఈ బ్యారేజీ నిర్మాణం జరుపుకునే అవకాశాలు ఉన్నాయి.

మూడు టీఎంసీల నీళ్లు విడుదల చేయండి...

తాగునీరు, వ్యవసాయ పొలాలకు అవసరమైన నీటిని ఇచ్చే జూరాల ప్రాజెక్టు జలాలు పూర్తిగా అడుగంటిన నేపథ్యంలో మూడు టీఎంసీల నీటిని ఉమ్మడి పాలమూరు జిల్లాకు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఈ ఎండకాలంలో ప్రజలు ఇబ్బందుల పాలు కాకుండా ఉండేందుకు వీలుగా నీటిని విడుదల చేయాలి అని ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు టీఎంసీల నీటిని విడుదల చేయడం ద్వారా జూరాలకు మేలు జరుగుతుంది అని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు, కర్ణాటక మంత్రులకు విజ్ఞప్తి చేశారు. మూడు టీఎంసీల నీటిని విడుదల చేయడం ద్వారా తాగునీటి సమస్యలు తీరడంతో పాటు.. చేతికొచ్చిన పంటలు పండడానికి అవకాశం దొరుకుతుందని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

జూరాల సామర్థ్యం పెంపునకు కసరత్తు!?

కృష్ణా జలాలను గరిష్ఠంగా వినియోగించుకునేలా ప్రస్తుతం 11 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల ప్రాజెక్టు ఎత్తును (సామర్థ్యాన్ని) పెంచే అవకాశాలపై కూడా ఈ సమావశంలో చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. జూరాల స్థాయిని పెంచడం ద్వారా అదనంగా లభించే నీటిలో 20 టీఎంసీలు పాలమూరు జిల్లాకు, మరో 20 టీఎంసీలు జోగులాంబ గద్వాల జిల్లాకు తరలించేలా సరికొత్త ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి.

Next Story