దేవునిగుట్ట తొలగింపుకు చర్యలు..

by Kodari Anjali |

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని జంగమయ్యపల్లి గ్రామ సమీపంలో ఉన్న తిరుమల్ దేవుని గుట్ట తొలగింపునకు చేసిన ప్రయత్నం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

దేవునిగుట్ట తొలగింపుకు చర్యలు..
X

దిశ, నవాబుపేట: మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని జంగమయ్యపల్లి గ్రామ సమీపంలో ఉన్న తిరుమల్ దేవుని గుట్ట తొలగింపునకు చేసిన ప్రయత్నం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తరతరాలుగా గ్రామస్తులు పవిత్ర స్థలంగా భావిస్తూ పూజలు నిర్వహిస్తున్న ఈ గుట్టను భూమి అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులు, భక్తులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారి అభ్యంతరాలు రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లిన వెంటనే వారు పోలీసులను సంఘటన స్థలానికి పంపి తవ్వకాలను నిలిపివేయించారు. స్థానికుల కథనం ప్రకారం.. గుట్ట ఉన్న పట్టా భూమిని ఇటీవల దాని యజమానులు ఓ అన్యమతస్తుడికి విక్రయించారు. అనంతరం కొనుగోలుదారుడు భూమి అభివృద్ధి పనుల్లో భాగంగా జెసిబిసిలతో భూమిని చదును చేస్తూ గుట్టను తొలగించే పనులు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, భక్తులు మండల రెవిన్యూ అధికారుల దృష్టికి తేగా వారు వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించారు.

గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం...

అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని త్రవ్వకాలను నిలిపివేయించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా గుట్టలను తొలగించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వారిని హెచ్చరించారు. భూమి విక్రయం సమయంలో గుట్టను తొలగించాల్సి వస్తే అక్కడి తిరుమల దేవుడిని సమీపంలోని మరో ప్రదేశానికి తరలించి ఆలయం నిర్మింపజేసి ఇస్తానని కొనుగోలుదారుడు విక్రయదారులకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా గుట్ట తొలగింపుకు కొనుగోలుదారు ప్రయత్నించడం పట్ల గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. "తరతరాలుగా పూజలు జరుగుతున్న ఈ దేవుని గుట్టను యథాతథంగా పరిరక్షించాలి. గుట్ట తొలగించకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. పట్టా భూమిలో గుట్ట ఉన్నప్పటికీ గుట్టలను తొలగించేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతులు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయిన నేపథ్యంలో గ్రామస్తుల అభ్యంతరాలు, భక్తుల మనోభావాలు, భూ యజమానుల హక్కులు, చట్టపరమైన నిబంధనల మధ్య ఈ వ్యవహారం ఎలా పరిష్కారమవుతుందన్నది స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

Next Story