- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్న రావణ్ ఇంట్లో సోదాలు.. భార్యను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు!
యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిన్న ఆయన నివాసంలో గన్నవరం పోలీసులు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు సోదాలు నిర్వహించారు. విచారణ నిమిత్తం ఆయన భార్యను గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, మావోయిస్టు భావజాలం, తన ఆదాయానికి సంబంధించి ఇంట్లో ఏదైనా కీలక ఆధారాలు లభించే అవకాశాలు ఉండొచ్చేమోనని సోదాలు చేసినట్లు తెలుస్తోంది.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్
మరోవైపు ప్రశ్న రావణ్‌కు చెందిన ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. కాకినాడ పోలీసులు బ్యాంకులకు లేఖలు రాయగా, వాటి ఆధారంగా ఖాతాలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో వివాదాస్పద వీడియోల ద్వారా ఆయన నెలకు రూ.1.5 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే రావణ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఫోన్‌లోని వీడియోలు, తొలగించిన డేటా, వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తూ ఆయన వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు..
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పలు కేసుల్లో అరెస్టైన రావణ్‌పై ఇటీవల గన్నవరం పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 152తో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కూడా కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనకు ఈ నెల 18 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. మాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. యువతను, విద్యార్థులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే అంశాలు ఆయన ఫోన్‌లో గుర్తించామని పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల్లో వ్యవస్థలపై ద్వేషభావం పెంచేలా వ్యాఖ్యలు చేయడం, దేశ సార్వభౌమాధికారం, ఐక్యతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు చేశారు. అలాగే, విచారణకు రావణ్ పూర్తిగా సహకరించడం లేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.






