నదిలా మారిన ముంబై-పూణే హైవే.. వరద ముంపుపై రాజకీయం వేడెక్కింది!

by Ramesh Naini |   (  Updated:2026-07-09 08:47:08  IST  )

గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న కుంభవృష్టి వానలకు ముంబై - పూణే జాతీయ రహదారి పూర్తిగా జలమయమైంది.

నదిలా మారిన ముంబై-పూణే హైవే.. వరద ముంపుపై రాజకీయం వేడెక్కింది!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న కుంభవృష్టి వానలకు ముంబై - పూణే జాతీయ రహదారి పూర్తిగా జలమయమైంది. వర్షపు నీరు రోడ్డుపై భారీగా చేరడంతో హైవే కాస్తా నదిని తలపిస్తోంది. మోకాళ్ళ లోతు నీటిలో వాహనాలు మునిగిపోతుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, రూ. 7,000 కోట్ల వ్యయంతో ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన 14 కిలోమీటర్ల ‘మిస్సింగ్ లింక్’ టన్నెల్ ప్రవేశ ద్వారం (ఆర్చ్) తొలి వర్షాలకే దెబ్బతినడం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వ ప్రాజెక్టుల నాణ్యతపై విపక్షాలు, విమర్శకులు మండిపడుతుండగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిపై ఘాటుగా స్పందించారు.

విమర్శకులపై సీఎం ఫడ్నవీస్ ఆగ్రహం..

తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు మరో ఇరవై ఏళ్లయినా గుర్తిండిపోతాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రను అవమానించేలా చేసే విమర్శలను సహించేది లేదన్నారు. ‘సొంత ఊరిలో కనీసం కుక్కలు కూడా దేకని కొందరు వ్యక్తులు, కేవలం డబ్బు కోసం సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి ‘అద్దె మనుషులకు’ తగిన బుద్ధి చెప్తాం’ అంటూ సీఎం హెచ్చరించారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విపక్షాల కౌంటర్

సంజయ్ రౌత్ (శివసేన UBT) స్పందిస్తూ.. ‘ముఖ్యమంత్రి భాష ఆయనలోని అహంకారాన్ని, అసహనాన్ని తెలియజేస్తోంది. అధికారం పోగానే ఈ అహంకారం మాయమవుతుంది. మహారాష్ట్రలో అత్యవసర పరిస్థితి ఏమీ లేదు. ప్రభుత్వ వైఫల్యాలను, బలహీనమైన మౌలిక సదుపాయాలను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది’ అని విమర్శించారు. సుష్మా అంధారే (శివసేన UBT) మాట్లాడుతూ.. ‘తనే మహారాష్ట్ర అనుకుంటూ సీఎం పొరబడుతున్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రజలు తమ పన్నుల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులలో అవినీతి, నాసిరకం పనులపైనే ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కును సీఎం లాక్కోలేరు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది సేవ చేయడానికి, తిట్టడానికి కాదు’ అని ధ్వజమెత్తారు. రహదారి దిగ్బంధనంతో ప్రజలు నరకం చూస్తుంటే, అటు నాసిరకం పనులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వేడిని పుట్టిస్తోంది.

Next Story