పనామా జంక్షన్‌లో ప్రమాద నిలయం.. ధ్వంసమైన మ్యాన్‌హోల్‌తో వాహనదారుల ప్రాణాలకు ముప్పు

by Kodari Anjali |

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65) విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

పనామా జంక్షన్‌లో ప్రమాద నిలయం.. ధ్వంసమైన మ్యాన్‌హోల్‌తో వాహనదారుల ప్రాణాలకు ముప్పు
X

దిశ, హస్తినాపురం/ వనస్థలిపురం: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (NH-65) విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వనస్థలిపురంలోని పనామా జంక్షన్ సమీపంలో వరద నీటి నాలాపై ఏర్పాటు చేసిన మ్యాన్‌హోల్ మూత ధ్వంసమై కిందకు ఒరిగిపోవడంతో నిత్యం వేలాది మంది వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు అధిక వేగంతో ప్రయాణిస్తుంటాయి. ఇలాంటి సమయంలో మ్యాన్‌హోల్‌పై ఉన్న ఇనుప పట్టీల మూత విరిగిపోవడంతో వాహనాల టైర్లు అందులో ఇరుక్కుపోయి ఎప్పుడైనా ఘోర ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ ప్రమాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. స్థానికుల కథనం ప్రకారం, ఈ సమస్య కొన్ని రోజులుగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత R&B, ఎంఎంసీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్‌కు తాత్కాలిక హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాణనష్టం సంభవించే ముందు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ధ్వంసమైన ఇనుప మూతకు వెల్డింగ్ చేసి, శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story