111 ఆదివాసి చెంచు గిరిజనుల సామూహిక వివాహం పవిత్రం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

by Ratna Kumari |

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలో ఉన్న ఆదివాసి చెంచు గిరిజనుల

111 ఆదివాసి చెంచు గిరిజనుల సామూహిక వివాహం పవిత్రం :  గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతంలో ఉన్న ఆదివాసి చెంచు గిరిజనుల సామూహిక వివాహ కార్యక్రమం వనవాసి కళ్యాణి పరిషత్, రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణ దేవ్ వర్మ హాజరై నూతన దంపతులను ఆశీర్వ‌దించారు. ఈ సంద‌ర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 111 ఆదివాసి గిరిజనుల సామూహిక వివాహం వారి సంస్కృతి సాంప్రదాయపద్ధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పుణ్యకార్యానికి దేవుడు ఆశీస్సులు తప్పక ఉంటాయని.. ఇక నుంచి నూతన దంపతులు జీవితాంతం సుఖ, సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. అడవులలో జీవిస్తున్న ఆదివాసీలు వారి జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుందని ఇలాంటి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. నల్లమల ప్రాంతంలో ఉన్న ఆదివాసి చెంచు గిరిజనులను మరొక సమయంలో వచ్చి మరల కలుస్తానని గవర్నర్ తెలిపారు.

గవర్నర్ ఆశీర్వాదం శుభ పరిణామం మాజీ గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ

ఆదివాసి గిరిజనుల సామూహిక వివాహానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కావడం శుభ పరిణామం అని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భారతీయ సాంప్రదాయ బద్ధంగా లోపాలు జరగడం సంతోషకరమని, కలకాలం సహజీవనం గడపాలని అభినందించారు.

ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటా : హైకోర్టు న్యాయమూర్తి మాధవిలత

గిరిజనుల సామూహిక వివాహాల కార్యక్రమానికి హాజరైన హైకోర్టు న్యాయమూర్తి మాధవిలత నూతన దంపతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను ఈ ప్రాంత కోడలినని మా స్వగ్రామం పదరా మండల ఉడిమిళ్ళ తంగిరాల హనుమంతు రెడ్డి కుటుంబమని.. నాకు ఆడబిడ్డలు లేరు ఇద్దరు మగ బిడ్డలే ఉన్నారని.. నూతన వధువులందరూ కూడా నా సొంత ఆడబిడ్డలుగా భావిస్తానని మీకు ఏ ఆపద వచ్చినా నేనున్నానన్న విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. అంతకుముందు జాగృతి దీపావళి ప్రత్యేక సంచిక సంఘ శతాబ్ది సంచిక ఆవిష్కరణ చేశారు. కార్య‌క్ర‌మంలో పరాశ్రీ స్వామీజీ పాలమూరు విభాగ్ సంఘ చాలక్, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విభాగ్ ప్రచారక్ దేవేందర్ రాజు, జిల్లా ప్రచార ప్రముఖ్ భాస్కరాచారి పాల్గొన్నారు.

Next Story