- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొల్లాపూర్‌లో ‘మార్కెట్’ మాయాజాలం.. ఎనిమిది నెలలైనా రాని జీవోలు
కొల్లాపూర్‌లో కొత్త మార్కెట్ కమిటీల ఏర్పాటుపై మంత్రి జూపల్లి ప్రకటన మాటలకే పరిమితం. 8 నెలలైనా రాని జీవోలు.. చైర్మన్ల హడావుడిపై విమర్శలు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : కొల్లాపూర్ నియోజకవర్గంలో కొత్త వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎనిమిది నెలల క్రితం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కొత్త మార్కెట్లు మంజూరవుతున్నాయని, వాటికి చైర్మన్లను ఖరారు చేశామని ప్రకటించారు. అయితే, నేటికీ ప్రభుత్వం నుంచి ఒక్క జీవో కూడా విడుదల కాలేదు. ఇప్పటికే ఉన్న కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పసుపుల నరసింహను, కొత్తగా పెద్దకొత్తపల్లికి దండు నరసింహ, వీపనగండ్లకు సుదర్శన్ రెడ్డి, కోడేరుకు కొత్త శ్రీనివాసరావు, పానుగల్‌కు శివలీల పేర్లను మంత్రి ఖరారు చేశారు. పార్టీ శ్రేణులు వారికి శుభాకాంక్షలు తెలిసినప్పటికీ, అధికారికంగా మార్కెట్ల మంజూరు ప్రక్రియ మాత్రం అడుగు ముందుకు పడలేదు.
ప్రమాణ స్వీకారం లేకుండానే ప్రారంభోత్సవాలు!
ప్రభుత్వ ఉత్తర్వులు రాకపోయినా, ప్రమాణ స్వీకారాలు చేయకపోయినా.. చైర్మన్లుగా ప్రకటించబడిన నేతలు అధికారిక కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలు, ఇతర ప్రారంభోత్సవాల్లో మంత్రికి బదులుగా వీరే హడావుడి చేస్తుండటం గమనార్హం. అధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. జీవోలు లేకుండానే చైర్మన్ల హోదాలో చలామణి కావడం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
ఉన్న మార్కెట్‌కూ వెలువడని జీవో
కొత్త మార్కెట్ల సంగతి పక్కన పెడితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న కొల్లాపూర్ మార్కెట్ కమిటీకి కూడా పూర్తిస్థాయి పాలకమండలిని ప్రకటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇతర మార్కెట్లకు నియామకాలు పూర్తయినా, కొల్లాపూర్ విషయంలో జాప్యం జరగడం వెనుక రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మంత్రి జూపల్లి ప్రకటించినట్లుగా కొత్త మార్కెట్లు అసలు మంజూరవుతాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త మార్కెట్లను మంజూరు చేసి, అధికారికంగా పాలకమండళ్లను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.






