- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక దోపిడీ.. కృష్ణానదిలో ఇసుకను తోడేస్తున్న మాఫియా
మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా నదీ తీరంలో ఇసుక మాఫియా అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇటు తెలంగాణతోపాటు అటు కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో మక్తల్ నాణ్యమైన ఇసుకకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ముడుమాల, వాసునగర్, గురుజాల పరివాహక ప్రాంతాల నుంచి రోజుకు వందలాది టిప్పర్ల ఇసుక తరలిపోతోంది.

మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా నదీ తీరంలో ఇసుక మాఫియా అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇటు తెలంగాణతోపాటు అటు కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో మక్తల్ నాణ్యమైన ఇసుకకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ముడుమాల, వాసునగర్, గురుజాల పరివాహక ప్రాంతాల నుంచి రోజుకు వందలాది టిప్పర్ల ఇసుక తరలిపోతోంది. ఇసుక వాహనాల రాకపోకల కోసం మాఫియా ఏకంగా నదిలోనే దర్జాగా కంకర రోడ్లు వేయడం గమనార్హం. ఒక్కో టిప్పర్ ఇసుకను రూ.70వేల వరకు విక్రయిస్తూ అక్రమార్కులు కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ దోపిడీ వెనుక తాజా, మాజీ ప్రజాప్రతినిధులతోపాటు రిటైర్డ్ పోలీస్ అధికారి బంధువుల హస్తం ఉంది. మైనింగ్, రెవెన్యూ అధికారులు ముడుపుల కక్కుర్తితో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
- దిశ, మక్తల్
దిశ, మక్తల్ : మక్తల్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. అధికారుల అలసత్వం, ప్రజాప్రతినిధుల సహకారంతో నియోజకవర్గంలో ప్రతిరోజు ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. కృష్ణా నది తీర ప్రాంతంలో ఉన్న నాణ్యమైన ఇసుక మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటు తెలంగాణ, అటు కర్ణాటక రాష్ట్రాలలో మక్తల్ కృష్ణా నది తీరంలో ఉన్న ఇసుకకు భారీ డిమాండ్ ఉంటోంది. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తోంది. కృష్ణా మండలం మునుమాల గ్రామంలోని యాదవేంద్ర స్వామి మఠం, వాసు నగర్, కృష్ణ ఘాట్, గురుజాల గ్రామం నుండి సంగమం వరకు నదీ పరివాహక ప్రాంతాలలో నాణ్యమైన ఇసుక ఉండడంతో మాఫియా దృష్టి ఈ ప్రాంతాలపై ఎక్కువగా పడింది. ఇసుక తీసే ప్రాంతం నుండి వాహనాలు బయటకు రావడానికి ఏకంగా కంకర రోడ్లు కూడా వేశారు.
రెండు రాష్ట్రాల్లో భారీ డిమాండ్:
ఈ ప్రాంతాల నుండి తీసుకువెళ్లే ఇసుకకు మన రాష్ట్రంలోని పలు జిల్లాలలోనే కాకుండా, అటు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్, యాదగిరి, గుల్బర్గా తదితర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కొక్క టిప్పర్ ఇసుక ధర రూ. 50 వేల నుండి రూ. 70 వేల వరకు పలుకుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయవలసి ఉండగా, తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఇసుక మాఫియాకు హద్దు అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అందరూ కుమ్మక్కై దర్జాగా రవాణా..
ఈ అక్రమ వ్యాపారంలో పార్టీలకు అతీతంగా చోటామోటా నాయకులు చేతులు కలిపినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో పనిచేసి రిటైర్డ్ అయిన ఓ మాజీ అధికారికి సంబంధించిన బంధువులు ఈ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మాజీ, తాజా ప్రజాప్రతినిధులు రాజకీయాలను పక్కన పెట్టి మరీ కుమ్మక్కై ఈ దందాను సాగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నదీ గర్భాన్ని గుల్ల చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నా, స్థానిక యంత్రాంగం ముడుపుల కక్కుర్తితో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






