ఆశ్ర‌మ పాఠ‌శాల విద్యార్థుల‌కు భోధించేవారు లేన‌ట్టేనా..?

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పదర మండలం ఉడిమిళ్ల‌ గ్రామంలో బాలికల ఆశ్రమ పాఠశాలలో 120 మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం

ఆశ్ర‌మ పాఠ‌శాల విద్యార్థుల‌కు భోధించేవారు లేన‌ట్టేనా..?
X

దిశ‌, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పదర మండలం ఉడిమిళ్ల‌ గ్రామంలో బాలికల ఆశ్రమ పాఠశాలలో 120 మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక్కడ అత్యధిక విద్యార్థినీలు ఆదివాసి గిరిజన విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థినీలు ఉన్నారు. విద్యార్థులకు తగిన విధంగా అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ప్రధాన భాష పరమైనటువంటి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల‌ పై తరగతులకు వెళ్లే విద్యార్థులకు పై సబ్జెక్టుల పైన పూర్తిగా అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. గత ఏడాది కూడా ఈ ఆశ్రమ పాఠశాలలో లాంగ్వేజ్ పండితుల కొరత ఉన్న విషయం పై అధికారులకు తెలిసిన కూడా వారు పట్టనట్టుగా ఉన్నారని విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే బుధవారం దిశ ప్ర‌తినిధి ఆశ్రమ పాఠశాలను సందర్శించగా లాంగ్వేజ్ పండితులు లేరు అనే విషయం వెలుగులోకి వచ్చింది.

ఆరు నెలలుగా పాఠాలు జరగని వైనం ?

ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి ఇప్పటివరకు 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ విద్యా బోధన పూర్తిగా అందలేదు. గత ఆరు నెలల నుంచి లాంగ్వేజ్ సబ్జెక్టులకు సంబంధించి పాఠాలు జరగకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందుకు సంబంధించి ఉన్నతాధికారులు సైతం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంలో అలసత్వం వహించారని విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆరు నుంచి తొమ్మిది త‌ర‌గ‌తుల‌తో పాటు 10వ తరగతిలో లాంగ్వేజ్ పై విద్యార్థులకు అవగాహన పట్టు లేకపోతే ప‌దో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణ‌త సాధించ‌డం ఎలా సాధ్యం అవుతుందో అధికారులే చెప్పాలి.

ఉన్నతాధికారులకు నివేదించాం ఇన్ చార్జీ హెచ్ఎం శోభ

ఆశ్రమ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు లాంగ్వేజ్ పండిట్ల ను ఏర్పాటు చేయాలని ఏటీడీఓ డిటిడిఓ ల దృష్టికి తీసుకెళ్లామని ఇన్ చార్జి హెచ్ఎం శోభ తెలిపారు. నేను కూడా పది రోజుల క్రితమే చార్జి తీసుకున్నా. విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఉపాధ్యాయుల ఏర్పాటు విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

రెండు రోజులలో తెలుగు ఉపాధ్యాయిని ఏర్పాటు చేస్తాం

ఉడిమిళ్ల ఆశ్రమ పాఠశాలలో లాంగ్వేజ్ పండిట్లు లేకపోవడంతో విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని దిశ ఫోన్ ద్వారా డీటీడీఓ ఫిరంగి దృష్టికి తీసుకెళ్లగా.. డీటీడీఓ స్పందిస్తూ రెండు రోజుల్లో తెలుగు ఉపాధ్యాయిని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సీఆర్టీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని, ఆ విషయం కోర్టులో పెండింగ్ లో ఉండడం వల్ల ఆలస్యం అవుతుందని, తద్వారా ఈ పోస్టులను భర్తీ చేసే క్రమంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామన్నారు.

Next Story