నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తో భూమి రిజిస్ట్రేషన్

by velandi.Saikiran |

నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తో ఏకంగా 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తో భూమి రిజిస్ట్రేషన్
X

దిశ, అమరచింత: నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తో ఏకంగా 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం మోట్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లారి రాములుకు ముగ్గురు భార్యలు ఉన్నారు. మొదటి, మూడవ భార్యకు ఇద్దరు కూతుళ్లు, రెండవ భార్యకు ఒక కొడుకు ఉన్నారు. సర్వే నెంబర్ 02 ,17,18,61 లతో పాటు మిగితా సర్వే నెంబర్లలో ఆయన పేరున, దాదాపు 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే పట్టాదారుడు పుల్లారి రాములు 2020లో మరణించాడు. ఆయన మరణించడంతో 12 ఎకరాల భూమిలో ముగ్గురు భార్యల వారసులకు చట్టపరమైన సమాన హక్కు ఉంటుంది. కానీ మొత్తం భూమిని రెండవ భార్య కొడుకు పుల్లారి సాయన్న పట్టా చేసుకునేందుకు పన్నాగం పన్నాడు. పుల్లారి రాములుకు తాను ఒక్కడే కుమారుడు అని రుజువు చేసుకునేందుకు 2025 అక్టోబర్ నెలలో ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తయారు చేయించాడు. అందులో గతంలో ఆత్మకూర్ తహశీల్దార్ కార్యాలయంలో పని చేసిన తహశీల్దార్ చాంద్ బాషా సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలిసింది.

ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తో తండ్రి పేరున ఉన్న భూమిని విరసత్ కింద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాడు పుల్లారి సాయన్న. తానే వారసుడునని ఆ నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాడు. ప్రస్తుతం ఉన్న తహశీల్దార్ జే కే మోహన్, ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను కార్యాలయంలోని డీ ఆర్ లో తనిఖీ చేయకుండానే, ఫేక్ సర్టిఫికెట్ తో వీరసత్ కింద పుల్లారి సాయన్న పేరున 12 ఎకరాల భూమిని గత నెలలో రిజిస్ట్రేషన్ చేశాడు.ఈ విషయం కాస్త మిగితా ఇద్దరు వారసులకు తెలియడంతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది.ఈ విషయంలో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరించి సర్ది చెప్పే పనిలో ఉన్నట్లు సమాచారం.ఈ వ్యవహారం మొత్తం తెలిసిన తహశీల్దార్ జేకే మోహన్ మాత్రం, తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడు. నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అదేవిదంగా రిజిస్ట్రేషన్ వివరాలను మీడియాకు తెలుపకుండా దాటవేయడం గమనార్హం.





Next Story