చెరువు క‌బ్జా.. కాపాడండి క‌లెక్ట‌ర్ గారూ..!

by Ratna Kumari |

దిశ, కల్వకుర్తి : మున్సిపల్ పరిధిలోని నాగర్ కర్నూల్ రోడ్డు పక్కన సర్వే నంబర్ 255 లో కుమ్మరి కుంట చెరువు సమీప స్థలంలో ఓ రైస్ మిల్లర్ తన మిల్ ను కాపాడుటకై చెరువు స్థలాన్ని

చెరువు క‌బ్జా.. కాపాడండి క‌లెక్ట‌ర్ గారూ..!
X

దిశ, కల్వకుర్తి : మున్సిపల్ పరిధిలోని నాగర్ కర్నూల్ రోడ్డు పక్కన సర్వే నంబర్ 255 లో కుమ్మరి కుంట చెరువు సమీప స్థలంలో ఓ రైస్ మిల్లర్ తన మిల్ ను కాపాడుటకై చెరువు స్థలాన్ని కబ్జా చేసి గతంలో దర్జాగా ప్రహరీ గోడను నిర్మించాడు. ఈ కుమ్మరి కుంట చెరువు కబ్జాకు గురైన విషయమై దిశ దినపత్రిక జనవరి 6 2023 " కబ్జా కోరల్లో కుమ్మరి చెరువు ", ఫిబ్రవరి 7 2023 " కుమ్మరి కుంట చెరువు కబ్జా ", మే 5 2025 " అధికారులు కూల్చారు. అయినా మ‌ళ్లీ ప్ర‌హ‌రీ నిర్మించాడు. ఆగష్టు 24 2025 " కుమ్మరికుంట చెరువు కబ్జాలో " అనే వరుస కథనాలను ప్రచురించింది. ఇలా చెరువులను చెరబట్టి నిర్మాణాలు చేపడితే రానున్న రోజుల్లో భావి తరాలకు చెరువులు లేకపోగా, భారీ వర్షాలకు పట్టణ, గ్రామాలు వరదలతో ముంపుకు గురైతాయని అనే కోణంలో " దిశ పత్రిక " దాదాపు ౩ ఏళ్ళుగా కథనాలు వెలుబడ్డాయి. గతంలో పనిచేసిన తహసిల్దార్, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించి చెరువు శిఖం భూమి హద్దులను గుర్తించారు. రైస్ మిల్ యజమానికి పలుమార్లు నోటిసులిచ్చి కొంత మేర ప్రహరి గోడను నేలమట్టం చేపించారు. రెండు మాసాలు గడవకముందే ఆ రైస్ మిల్ యజమాని మరల దర్జాగా ప్రహారిని నిర్మించుకున్నాడు. ప్రహరి నిర్మించిన అనంతరం దిశ ప్రతినిధి అధికారుల వివరణ కోరగా మిల్ యజమానిపై ఆయా శాఖల పరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పి రోజులు..నెలలు.. ఏండ్లు గడుస్తున్నాయే తప్పా ప్రభుత్వ చెరువు శిఖాన్ని మాత్రమే కాపాడటంలో ఉద్దేశ పూర్వకంగా అలసత్వం ప్రధర్శిస్తున్నారనీ పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఈ ఏడాది ఆగష్టు 27న నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు కుమ్మరి కుంట చెరువు పరిశీలించి చెరువు శికం కబ్జాకు గురైనందని నిర్దారించి రాళ్ళతో హద్దులు నాటారు. 30వ తేదిన ఆ రైస్ మిల్ యజమానికి నీటి పారుదల శాఖ డిఈఈ పేరిట నోటిస్ అందిన అనంతరం 10 రోజుల గడువు ఇస్తే మేమే తీసేస్తాం అని మిల్ యజమాని అన్నట్టు సమాచారం. ఇచ్చిన గడువు ముగిసి రెండు మాసాలు గడుస్తున్నా " ఎక్కడ వేసిన గొంగడి" అన్నట్టుగా ఉంది. సంబందిత శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నిరేత్తనట్టుగా వ్యవహరించడంలో పరమార్థం ఏంటో తెలియడం లేదు. అధికారుల అజమాయిషీ లేదు. చెరువులు ఆక్రమించి దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకోరు. గతంలో ప్రభుత్వ ఆస్తులు ఎవరైనా ఆక్రమిస్తే సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం అవినీతి, అలసత్వం వలన పట్టించుకున్నవారు లేరనే అపవాదు మూటకట్టుకుంటున్నారు. నేడు చెరువులను కబ్జా చేస్తుంటే అధికారులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. కుమ్మరి కుంట చెరువును కాపాడే స్థానిక అధికారులు అలసత్వం వహిస్తున్నందున, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సత్వరమే నిర్ణయం తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Next Story