కొండారెడ్డిపల్లి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

by Ratna Kumari |

అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.

కొండారెడ్డిపల్లి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్
X

దిశ, కందనూల్ : అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, జిల్లా పరిషత్ సీఈఓ దేవ సహాయం, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మంజూరైన అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) కోసం పాలిటెక్నిక్ కళాశాలకు అవసరమైన 5 ఎకరాల భూమిని వెంటనే నిర్మాణానికి అప్పగించాలని వంగూరు తహసిల్దార్‌కు సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలను తొలగించి, కొత్త భవన నిర్మాణాన్ని వేసవి సెలవుల్లో పూర్తి చేయాలని, అంగన్ వాడి నూతన భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. బ్యాంక్ భవన ఆధునికీకరణ పనులను కూడా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే మంజూరై కొనసాగుతున్న పనులను రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించి నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, జిల్లా పరిషత్ సీఈఓ దేవ సహాయం, ఈఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విజయ్ కుమార్, డీపీఓ శ్రీరాములు, సీపీఓ సుజాత, వంగూర్ తహశీల్దార్ పాల్గొన్నారు.

Next Story