క‌ల‌క‌లం రేపిన క‌మ‌ల‌నాథుల ఆందోళ‌న

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-05-03 12:07:12  IST  )

నవాబుపేట మండల కేంద్రం ఆదివారం రాజకీయ వేడితో దద్దరిల్లింది. బీజేపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన భారీ ఆందోళన మండల రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది.

క‌ల‌క‌లం రేపిన క‌మ‌ల‌నాథుల ఆందోళ‌న
X

దిశ, నవాబుపేట : నవాబుపేట మండల కేంద్రం ఆదివారం రాజకీయ వేడితో దద్దరిల్లింది. బీజేపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన భారీ ఆందోళన మండల రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. తంగెళ్లపల్లి ఘటనలో సరైన విచారణ లేకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు నవాబుపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. పెద్ద ఎత్తున చేరుకున్న కమలదళం చేసిన నినాదాలు ఆ ప్రాంతాన్ని మార్మోగించింది. ఈ ఆకస్మిక ముట్టడితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డిల నేతృత్వంలో ఆందోళన మరింత ఉధృతమైంది.


తంగెళ్లపల్లి ఘటనపై ఉన్నతాధికారుల స్థాయిలో పరిశీలన లేకుండానే కేసులు నమోదు చేయడం పోలీసుల తీరుపై అనుమానాలు కలిగిస్తున్నదని నేతలు మండిపడ్డారు. ఎస్సై విక్రమ్ నిరపరాధులను కేసుల్లో ఇరికించారని, మతమార్పిడులకు ప్రోత్సాహం ఇస్తున్నారనే ఆరోపణలు చేస్తూ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా తీవ్రరూపం దాల్చడంతో మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీ నాయక్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఘటనపై స్వయంగా సమగ్ర విచారణ జరిపిస్తాం. కేసుల నమోదు విషయంలో లోపాలు ఉంటే సరిదిద్దుతామని, నిర్దోషులను కేసుల్లో నుండి తప్పిస్తామని, ఆ విషయంలో ఎస్సై తప్పు చేసినట్లు నిరూపితమైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఐ హామీతో శాంతించిన బిజెపి నాయకులు చివరికి ధర్నాను విరమించారు. మండల అధ్యక్షుడు సి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ జోక్యంతో ప్రస్తుతం పరిస్థితి చల్లబడినప్పటికీ, ఎస్సైపై చర్యల అంశం మండల రాజకీయాల్లో ఇంకా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో నవాబుపేట రాజకీయాలు మళ్లీ మంటలు రేపే సూచనలు కనిపిస్తున్నాయి.

Next Story