- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కడే స్టూడెంట్.. ఇద్దరు టీచర్లు..!
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయిచేడ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి, పడిపోతున్న విద్యా ప్రమాణాలకు అద్దం పడుతోంది.

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయిచేడ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి, పడిపోతున్న విద్యా ప్రమాణాలకు అద్దం పడుతోంది. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తుండగా రికార్డుల్లో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే ఉండడం గమనార్హం. టీచర్లు సకాలంలో పాఠశాలకు రాకపోవడంతో ఉన్న ఒక్క విద్యార్థి కూడా బడికి రావడం మానేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బడిబాట’ కార్యక్రమాన్ని ఇక్కడి ఉపాధ్యాయులు పూర్తిగా గాలికి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. గతేడాది నలుగురు ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది ఒకటికి పడిపోవడంపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కాంప్లెక్స్ హెచ్ఎం వివరణ ఇస్తూ విద్యార్థులు లేని రాయిచేడ్ స్కూల్ టీచర్లను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపేందుకు ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.
దిశ, అచ్చంపేట : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో క్షీణిస్తున్నాయో చెప్పడానికి నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచేడ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలే నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్నది మాత్రం కేవలం ఒక్కడంటే ఒక్క విద్యార్థి మాత్రమే. విచిత్రమేమిటంటే ఆ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు హాజరు కావడం లేదు. గురువారం ఈ పాఠశాలను మీడియా ప్రతినిధులు సందర్శించగా ఇద్దరు ఉపాధ్యాయులకు గాను ఒకరు మాత్రమే విధుల్లో ఉన్నారు. సదరు ఉపాధ్యాయుడు కూడా పాఠశాలకు సకాలంలో రావడం లేదని, అది గమనించే సదరు విద్యార్థి అసలు బడికి రావడం మానేశాడని గ్రామస్తులు చెబుతున్నారు.
భరోసా ఇవ్వని ఉపాధ్యాయులు..
ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం గ్రామంలో సంచరించి పిల్లలను చేర్పించే ప్రయత్నం అస్సలు చేయలేదని తెలుస్తోంది. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ‘మేమున్నాం.. బడికి పంపండి’ అని భరోసా ఇచ్చిన పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు తమ విధులను పక్కనపెట్టి, ఉపాధ్యాయ యూనియన్ల పేరుతో కాలయాపన చేస్తూ వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
గత ఏడాది ఈ పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే చదువుకోగా ఈ ఏడాది ఆ సంఖ్య ఒకటికి పడిపోయింది. సంబంధిత విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే నియోజకవర్గంలో అక్కడక్కడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
డిప్యూటేషన్‌కు సిఫార్సు చేశాం
రాయిచేడ్ పాఠశాలలో వెంకటరామ్, లక్ష్మణ్ అనే ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వెంకటరామ్ సెలవులో ఉండగా, లక్ష్మణ్ విధులకు హాజరయ్యారు. విద్యార్థులు లేని కారణంగా సదరు ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోటుకు డిప్యూటేషన్‌పై బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులకు తగిన సూచనలు చేశాం.
- ఆంజనేయులు, కాంప్లెక్స్ హెచ్ఎం






