విద్యాభివృద్ధిలో జడ్చర్లను అగ్రగామిగా చేస్తా : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

by Ratna Kumari |

విద్యా రంగంలో జడ్చర్ల నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రకటించారు.

విద్యాభివృద్ధిలో జడ్చర్లను అగ్రగామిగా చేస్తా : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
X

దిశ, జడ్చర్ల : విద్యా రంగంలో జడ్చర్ల నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచే కాకుండా ప్రైవేటు కంపెనీల నుంచి కూడా సీఎస్ఆర్ పథకం ద్వారా తీసుకొస్తామని, రాబోయే రెండేళ్ల కాలంలోనే రూ.70 కోట్లు విద్యాభివృద్ధి కోసం సమీకరిస్తామని వెల్లడించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా శనివారం జరిగిన జడ్చర్ల నియోజకవర్గ స్థాయి సమావేశంలో అనిరుధ్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు ఎక్కువగా ఉంటాయి. వాటి బిల్డింగులు కూడా పెద్దగా ఉంటాయని, కానీ గవర్నమెంట్ స్కూళ్లలో బిల్డింగులు చిన్నగా ఉన్నా.. వాటిలో చదువులు మాత్రం బాగుంటాయని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లో పని చేసే టీచర్లు అందరూ విద్యాధికులు, శిక్షణ పొందిన వారని అందుకే వారు టీచర్లు పాఠాలు బాగా చెప్తారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారు చాలా మంది మంచి వృద్ధి లోకి వచ్చారన్నారు. అందుకే అన్ని గ్రామాల్లోనూ స్కూళ్లను అభివృద్ధి చేసుకోవాలని, దీనికి పూర్తిగా తన సహకారం అందిస్తానని చెప్పారు. ఈ విషయంలో తాను రాజకీయ విబేధాలను పట్టించుకోబోననతెలిపారు. రాష్ట్రంలో బాసర తర్వాత జడ్చర్ల లోనే ట్రిపుల్ ఐటీ వచ్చిందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రామాల్లో పదో తరగతిలో 500 కు పైబడి మార్కులు సాధించిన విద్యార్థులతో ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ రాయించి అత్యధిక సీట్లను సాధించుకోవడానికి కృషి చేయాలని కోరారు.


నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం జరుగుతున్న కృషి, పదో తరగతి విద్యార్థులకు ఇచ్చిన ఉచిత స్టెడీ మెటీరియల్ కారణంగా ఉత్తీర్ణతా శాతం బాగా పెరిగిందన్నారు. పదో తరగతిలో జడ్చర్ల మండలంలో 2022-23 లో 56% మంది మాత్రమే పాస్ కాగా, ప్రస్తుతం 2024-25 లో 91% మంది పాస్ అయ్యారని, రాజాపూర్ మండలంలో కూడా పాస్ పర్సంటేజీ 56% నుంచి 97% శాతానికి పెరగగా.. నవాబుపేట మండలంలో 100% మంది టెన్త్ పాసయ్యారని అనిరుధ్ రెడ్డి ఉదహరించారు. కేవలం ఉత్తీర్ణతా శాతం పెరగడమే కాకుండా ప్రైవేట్ స్కళ్ల కంటే గవర్నమెంట్ స్కూళ్ల లో చదివే పిల్లలే ఎక్కువ మార్కులు కూడా సాధించారని వివరించారు. పాఠశాలల అభివృద్ధి కోసం ప్రైవేటు సంస్థల సహకారం కూడా తీసుకుంటామని రాబోయే రెండేళ్ల కాలంలో రూ.70 కోట్లు సీఎస్ఆర్ పథకం కింద విద్యాభివృద్ధి కోసం సమీకరిస్తామని చెప్పారు. అరబిందో ఫార్మా కంపెనీ కూడా తాను అడిగిన వెంటనే సీఎస్ఆర్ ఫండ్స్ కింద రూ.4 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఈ నిధులతో ఊర్కొండ మండలంలోని గుడిగానిపల్లి సహా మరికొన్ని పాఠశాలలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజాపూర్, మిడ్జిల్ మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి మహిళా సంఘాలకు వాటిని ఇవ్వాలని తాను ప్రతిపాదించానని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఎస్డీఎఫ్ ఫండ్స్ 5 కోట్లను 100 గ్రామాలకు ఇచ్చానని, మిగిలిన 88 గ్రామాలకు కూడా ఈ ఏడాది నిధులను ఇస్తామన్నారు. ప్రజాపాలనలో భాగంగా నియోజకవర్గంలో 12, 435 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కొన్ని చోట్ల ఒకేసారి ఇవ్వాల్సిన 3 నెలల సన్న బియ్యానికి బదులు ఒక నెల కోటా ఇవ్వకుండా బియ్యానికి బదులుగా డబ్బు ఇచ్చారనే ఫిర్యాదులు తనకు అందాయని, ఇలాంటి తప్పులను తాను ఉపేక్షించే ప్రసక్తే లేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేసారు.


నియోజకవర్గంలో కొత్తగా 22 విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయించామని, వాటిలో నిర్మాణం పూర్తయిన వాటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల కాలనీకి కొత్త సబ్ స్టేషన్ మంజూరు అయింద‌ని, నిర్వాసితులకు రావాల్సిన రూ. 200 కోట్లు పరిహారం కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గ్రామాల్లో సమస్యలు ఉన్న చోటు విద్యుత్ లైన్లు, పోల్స్ షిఫ్టింగ్ కూడా చేపడుతామని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. అంగ‌న్ వాడీ విద్యార్థులకు యూనిఫామ్స్, టీచర్లకు మొబైల్ ఫోన్స్ ని పంపిణీ చేశారు. బ్యాంకు లింకేజ్ పథకంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం లోని మహిళా సంఘాలకు 5.90 కోట్ల చెక్కులు అందజేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story