- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే జైలు శిక్ష తప్పదు : ఎస్పీ టి. శ్రీనివాసరావు
ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత అక్రమ మార్గాల వైపు మళ్లకుండా ఎస్పీ టి. శ్రీనివాసరావు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

దిశ, గద్వాల క్రైమ్ : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో యువత అక్రమ మార్గాల వైపు మళ్లకుండా ఎస్పీ టి. శ్రీనివాసరావు కీలక హెచ్చరికలు జారీ చేశారు. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా ద్వారా యువతకు, తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు.
ఆర్థిక సంక్షోభం నుంచి ఆత్మహత్యల వరకు
క్రికెట్ బెట్టింగ్స్ కారణంగా యువత ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడమే కాకుండా, అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయని, తద్వారా నిండు నూరేళ్ల జీవితంతో పాటు కుటుంబాలు కూడా వీధిన పడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
నిర్వాహకులపై ప్రత్యేక నిఘా
క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇందులో పాల్గొనే వారిపై కఠినమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఎస్పీ హెచ్చరించారు. బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. "క్రికెట్‌ను కేవలం వినోదంగా మాత్రమే చూడండి.. దాన్ని అక్రమ సంపాదనకు మార్గంగా ఎంచుకోకండి" అని ఆయన హితవు పలికారు.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో వారి రోజువారీ కార్యకలాపాల్లో ఏవైనా అనుమానాస్పద మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని కోరారు.
సమాచారమిస్తే వివరాలు గోప్యం
జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్, పేకాట, బెట్టింగ్ యాప్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అక్రమాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా ఎస్పీ యువతకు పిలుపునిచ్చారు.






