- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడో గ్యారంటీ అంటే జర్నలిస్టులను ఏడిపించడమేనా..?
దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరిటా అధికారంలోకి వచ్చిన సీఎం

దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరిటా అధికారంలోకి వచ్చిన సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. జీఓ నంబర్ 252తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల అక్రిడిటేషన్లకు కోత విధంచడమంటే ఏడవ గ్యారంటీ అంటే జర్నలిస్టులను ఏడిపించడమేనా అంటూ టీయూడబ్లు్యజే హెచ్ 143 జాతీయ కౌన్సిల్ సభ్యులు వారధి నవీన్‌కుమార్, జిల్లా అధ్యక్షులు కె.ఆనంద్‌కుమార్‌గౌడ్‌లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డుల జారీచేసేందుకు విడదల చేసిన జీఓ నంబర్ 252తో భారీ కోత విధిస్తుండడాన్ని టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శనివారం టీయూడబ్ల్యూజే జిల్లా కమిటి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రధాన రహాదారి గుండా ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టరేట్‌కు చేరుకొని గేట్ ధర్నా చేపట్టారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన అక్రిడిటేషన్ల జారీ కోసం జీవో నం.252ను తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నాం...కానీ ఈ జీఓ తెలంగాణ జర్నలిస్టుల హక్కులకు గొడ్డలి పెట్టులా కొన్ని నిబంధనలతో ఇప్పటివరకు అక్రిడిటేషన్లు కలిగిన దాదాపు 10 వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తపరిచారు.
గతంలో అమలులో ఉన్న జీవో నం.239 ప్రకారం బిగ్ పేపర్లకు 20 మంది కరస్పాండెంట్లు, 20 మంది డెస్క్ జర్నలిస్టులు, 4 మంది కెమెరామెన్లకు అక్రిడిటేషన్లు మంజూరు చేసేవారు. అయితే ప్రస్తుతం జీవో నం.252 ద్వారా ఈ సంఖ్యను 12 కరస్పాండెంట్లు, 12 డెస్క్ జర్నలిస్టులు, 3 కెమెరామెన్లకు తగ్గించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో ఈ తరహా కోతనే విధించారని, మీడియం పత్రికలు, శాటిలైట్ ఛానళ్లకు గణనీయమైన కోత విధించారన్నారు. గతంలో కేబుల్ ఛానళ్లకు ఐ అండ్‌పీఆర్ ద్వారా రాష్ట్ర స్థాయిలో 12 అక్రిడిటేషన్లు మంజూరు చేయబడేవి. ప్రస్తుతం వాటిని పూర్తిగా సున్నాకు పరిమితం చేయడం తీవ్ర ఆందోళన కలిస్తున్నదన్నారు. ప్రసారాలు జరుగుతున్న ప్రతి జిల్లాలో గతంలో 4 అక్రిడిటేషన్లు ఇచ్చేవారని, ఇప్పుడు ఒకే జిల్లాలో కేవలం 2 అక్రిడిటేషన్లు మాత్రమే ఇస్తామని పేర్కొనడం అనేక మంది జర్నలిస్టుల పై ప్రభావం చూపుతుందన్నారు. ఇంతకుముందు నియోజకవర్గ స్థాయి రిపోర్టర్లకు అక్రిడిటేషన్లు మంజూరు చేసేవారని కానీ నూతన జీఓతో పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. ఒక లక్ష జనాభా ఉన్న మండలానికి ఒక అక్రిడిటేషన్, అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే రెండవ అక్రిడిటేషన్ ఇచ్చే విధానం గతంలో అమలులో ఉండేదని, ప్రస్తుతం జనాభా ఎంత ఉన్నా ఒక్క అక్రిడిటేషన్ మాత్రమే ఇచ్చేలా నిబంధన తీసుకురావడంతో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులను వేరు చేస్తూ ‘మీడియా కార్డు’ పేరిట విభజన తీసుకురావడం జర్నలిస్టు సమాజంలో తీవ్ర చర్చకు, అసంతృప్తికి దారితీస్తోందన్నారు.
ఇది ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. పదిహేను వేల కంటే తక్కువ సర్కులేషన్ ఉన్న చిన్న పత్రికలకు అన్యాయం జరుగుతుందని, గతంలో నియోజకవర్గ స్థాయిలో ఇచ్చే కార్డు కాస్త ఇప్పుడు కట్ అవుతుందన్నారు. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అన్న తేడా లేకుండా అందరినీ మీడియా అక్రిడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తించే విధంగా, జర్నలిస్టుల ఉపాధి, గౌరవం, హక్కులను పరిరక్షించేలా జీవో నం.252ను సవరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే టెంజు జిల్లా అధ్యక్షులు అవుటి రాజశేఖర్, టీయూడబ్ల్యూజే 143 జిల్లా ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు హర్షద్ ఫైజల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడిగే అనంత్‌రామ్, నాయకులు అంబాదాస్, శ్రీధర్,రమేష్‌గౌడ్, సుదర్శన్‌గౌడ్,చంద్రశేఖర్‌గౌడ్, రహిమతుల్లా, వినోద్, వెంకట్రాములు, సంతోష్, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.






