ఆ స్థ‌లం ఎంపిక వివాదం కానున్నదా..?

by Ratna Kumari |   (  Updated:2026-01-18 10:20:51  IST  )

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల ఫారెస్ట్.. పదరా మండలం మద్దిమడుగు గ్రామంలో ఫిబ్రవరి 15న లంబాడీల ఆరాధ్య దైవం గా మన్ననలను పొందుతున్న సంతు సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ, శిలాఫలకం చేయ‌నున్నారు.

ఆ స్థ‌లం ఎంపిక వివాదం కానున్నదా..?
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల ఫారెస్ట్.. పదరా మండలం మద్దిమడుగు గ్రామంలో ఫిబ్రవరి 15న లంబాడీల ఆరాధ్య దైవం గా మన్ననలను పొందుతున్న సంతు సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ, శిలాఫలకం చేయ‌నున్నారు. ఈ మేర‌కు జనవరి 16న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ స్టేట్ సెల్ ప్రెసిడెంట్ రాములు నాయక్ పర్యటించి 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని గమనించిన ఆదివాసీలు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన సేవాలాల్ ను సమ్మక్క, సారలమ్మ గడ్డమీద.. ఆదివాసీల అస్తిత్వానికి దెబ్బతీసేలా నల్లమల్లగడ్డపై ఎలా ఏర్పాటు చేస్తారని.. ఆదివాసి సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ విష‌యం పై ఎమ్మెల్యే వంశీ కృష్ణ‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పున‌రాలోచ‌న చేయాల‌ని ఆదివాసి నాయ‌కులు సోష‌ల్ మీడియా వేదిక ద్వారా కోరుతున్నారు.

ఆ స్థలం ఎంపిక వివాదం కానుందా..?

స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నల్గొండ జిల్లా దేవరకొండ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లంబాడీల ఆదివాసి దైవం సంతు సేవాలాల్ విగ్రహాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. మ‌ద్దిమ‌డుగు ప్రాంతానికి లంబాడీలు అధికంగా వ‌స్తుంటార‌ని.. అక్క‌డ విగ్ర‌హం ఏర్పాటు చేస్తాన‌ని గ‌తంలో చెప్పిన విష‌యం తెలిసిందే. ఈనెల 16న నల్లమల్ల ప్రాంతంలోని పబ్బతి అంజన్న స్వామి సన్నిధిలో మద్దిమడుగు గ్రామంలో ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు పర్యటన చేసి అక్కడే 20 ఎకరాలలో దేశంలో ఎక్కడలేని విధంగా అద్భుతంగా సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా రూపకల్పన చేస్తామని స్వయంగా ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఆదివాసీలు భ‌గ్గుమంటూ ఈ స్థలాన్ని ఎలా ఎంపిక చేస్తారు ? ఒకపక్క లంబాడా గిరిజనులకు, ఆదివాసీల వర్గ పోరు జరుగుతున్న సందర్భంలో.. రాష్ట్రంలో ఉన్న తొమ్మిది చెంచు ఆదివాసీ తెగలు, ఇతరులు వర్గీకరణ చేయాలని పోరాటం చేస్తున్న తరణం లో ఆ నిర్ణయం కోర్టు పరిధిలో ఉంద‌ని తెలిపారు. అలాంటి స‌మ‌యంలో కర్ణాటకకు చెందిన సేవాలాల్ ను నల్లమల సమ్మక్క- సారలమ్మ గడ్డపై ఎలా నిర్మిస్తారు ? ఆదివాసులు నడియాడిన ప్రదేశంలో జంగ్ జంగల్ జమీన్ అనే పోరాటం చేసిన స్థలంలో ఏర్పాటు చేయడం తగదని ? అలా చేస్తే ఊరుకోమని ? ప్రభుత్వం పునరాలోచన చేయాలని ? ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా జనవరి 25న చలో మద్దిమడుగు అంటూ ఆదివాసీలు పిలుపునిచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఆ స్థలం వివాదం కానుందా అంటే.. అవుననిపిస్తుంది. అందుకు ఆదివాసి చెంచు గిరిజనులు నిర్ణయం పై అసంతృప్తి, ఆక్రోషం, ఆగ్రహం, అలాగే పాలకులకు, పాలితులకు ఆదివాసీలు అంటే చిన్న చూపు వలన ఇలాంటి నిర్ణయాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.

పొంచి ఉన్న ప్ర‌మాదం..

జాతి అస్తిత్వాన్ని తాకట్టుపెట్టి నోరు మెదపని ఆదివాసి రాజకీయ నాయకుల వల్లే పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆదివాసీలు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రంలోనే యావత్ 9 ఆదివాసి తెగలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు. పై తెగలవారు ధర్మ యుద్ధం కోసం ఆధార్ సొసైటీ పేరుతో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి పోరాడుతున్న తరుణం ఒకవైపు.. 5వ షెడ్యూల్లో ఉన్న ప్రదేశంలో చెంచుల కోసం ప్రజలు చేసిన ప్రదేశాలలో సేవలాల్ విగ్రహం ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కావున మద్దిమడుగులో సంతు సేవాలాల్ విగ్రహ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా తండోపతండాలుగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి 9 తెగల కు సంబంధించిన ఆదివాసీలు నాయకులు, విజ్ఞులు, సామాజిక, పౌర హక్కుల నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నారు. కావున రెండు గిరిజన తెగలకు సంబంధించి మరోసారి పై వివాదంతో ఆందోళనలు, పోరాటాలు ఉవ్వెత్తున లేచే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంపై పాలకులు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

Next Story