యూరియా పంపిణీలో అక్రమాలను సహించను

by Elthuri vijay kumar |

-పారదర్శకంగా యూరియా పంపిణీ చేపట్టాలి -నవాబుపేట కోరమండల్ డీలర్ పై డీఏఓతో విచారణ, చర్యలకు సిఫారసు -ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి

యూరియా పంపిణీలో అక్రమాలను సహించను
X

యూరియా పంపిణీలో అక్రమాలను సహించను

-పారదర్శకంగా యూరియా పంపిణీ చేపట్టాలి

-నవాబుపేట కోరమండల్ డీలర్ పై డీఏఓతో విచారణ, చర్యలకు సిఫారసు

-ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి

దిశ, జడ్చర్ల : యూరియా పంపిణీలో డీలర్లు, అధికారులు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేసారు. రైతులకు వ్యవసాయ అధికారులే టోకెన్లు ఇచ్చి వాటి ప్రకారంగానే యూరియాను పంపిణీ చేయాలని, దీనికి భిన్నంగా ఎక్కడైనా జరుగుతుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. నవాబుపేటలో యూరియా పంపిణీలో కోరమాండల్ డీలర్ చేసిన అవకతవకలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖాధికారి (డీఏఓ)ను కోరామని వెల్లడించారు.జడ్చర్ల నియోజకవర్గంలో గత ఏడాది వానాకాలం ఖరీఫ్ సీజన్ మొత్తానికి ఇచ్చిన యూరియా కంటే అధికంగా యూరియాను ఇప్పటికే రైతులకు అందించామని గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.

గత ఏడాది ఖరీఫ్ లో సీజన్ మొత్తానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయగా ప్రస్తుతం ఇప్పటికే 9600 టన్నులకు పైగా యూరియాను రైతులకు అందించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో యూరియా రాకపోవడం, గత ఖరీఫ్ సీజన్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ప్రస్తుతం పంటలు సాగు చేయడంతో యూరియాకు ఎక్కువ డిమాండ్ ఏర్పడిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు చేసిన నేపథ్యంలో తాను అధికారులతో మాట్లాడి ఎక్కువ పరిమాణంలో యూరియా జడ్చర్ల నియోజకవర్గానికి కేటాయించేలా చూస్తున్నానని వివరించారు.

నవాబుపేటలోని కోరమాండల్ డీలర్ కు మంగళవారం 460 బస్తాల యూరియాను కేటాయించి, దానికి సంబంధించి 460 మంది రైతులకు టోకెన్లు జారీ చేయగా, కోరమాండల్ లో పని చేసే మధు శేఖర్ అనే వ్యక్తి టోకెన్లు లేకుండానే సుమారు 200 మందికి యూరియాను ఇచ్చాడని, దీంతో అక్కడ టోకెన్లు తీసుకున్న రైతులు అందరికీ యూరియా దొరక్క వారు ఆందోళన చేసారని తెలిపారు. అలాగే యూరియా తీసుకోని రైతులకు కూడా వారు యూరియా తీసుకున్నట్లుగా మెసేజ్ లు వచ్చాయనే విషయం కూడా తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ సంఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తాను డీఏఓను కోరానని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో పూర్తి పారదర్శకంగా యూరియా పంపిణీ జరగాలని అధికారులను కోరారు. అయినప్పటికీ రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి రైతులకు యూరియా సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలన్నారు. యూరియా పంపిణీలో నిబంధనలకు భిన్నంగా అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తిస్తే తన దృష్టికి తీసుకురావాలని అనిరుధ్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Next Story