ఏడేళ్ల కిందట తెగి పోయిన బీమా కాలువ.. అధికారుల‌పై మంత్రి ఆగ్ర‌హం

by Ratna Kumari |

మండల పరిధిలోని నాగర్లబండ తాండ సమీపంలో ఏడు సంవత్సరాల క్రితం తెగిపోయిన భీమా కాల్వను శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులు నిర్వహిస్తున్న పని తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడేళ్ల కిందట తెగి పోయిన బీమా కాలువ.. అధికారుల‌పై మంత్రి ఆగ్ర‌హం
X

దిశ, వీపనగండ్ల : మండల పరిధిలోని నాగర్లబండ తాండ సమీపంలో ఏడు సంవత్సరాల క్రితం తెగిపోయిన భీమా కాల్వను శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులు నిర్వహిస్తున్న పని తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 జూలై నెలలో బీమా–16వ కేజీ హై లెవెల్ బ్రిడ్జి వద్ద తెగిపోయిన భీమా కాల్వ ఇప్పటికీ పునరుద్ధరించబడకపోయినా, ఆ కాల్వ ద్వారా 6 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు అధికారుల రికార్డుల్లో చూపించడంపై మంత్రి తీవ్రంగా ప్రశ్నించారు. తెగిపోయిన కాల్వ ద్వారా ఎలా సాగునీరు అందుతుందని అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా భీమా ఎస్‌సి చంద్రశేఖర్, సీఈ నాగేంద్రతో కలిసి కాల్వ పరిస్థితిని మంత్రి పరిశీలించారు. శ్రీరంగాపూర్ రంగ సముద్రం నుంచి భీమా కాల్వ పనులను సుమారు 70 కోట్ల రూపాయల అగ్రిమెంట్‌తో ఆర్ఎన్ఆర్ కనెక్షన్స్ కంపెనీకి అప్పగించినట్లు వివరించారు. మొత్తం 76 కిలోమీటర్ల కాల్వ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 62.5 కిలోమీటర్లు మాత్రమే పూర్తి అయ్యాయని తెలిపారు. అయినప్పటికీ కాంట్రాక్టర్‌కు 98 శాతం నిధులు విడుదల చేయడం ఎలా జరిగిందని మంత్రి అధికారులను ప్రశ్నించారు.భీమా కాల్వ ద్వారా మొత్తం 21 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 16 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందని పేర్కొన్నారు. ఇంకా సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందకపోవడం రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని అన్నారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు, రైతులు మంత్రికి తమ సమస్యలను వివరించారు. ఏడు సంవత్సరాలుగా కాల్వ తెగిపోయి ఉండటంతో పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులపై ప్రత్యేక నివేదిక సమర్పించాలని అధికారుల కు సూచించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం మండలంలోని నాగర్ల బండ తండాలో గ్రామస్తులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని, తన కృషి ఫలితంగా రైతులకు ఉచిత విద్యుత్ అందుతున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం వంటి పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ, బొల్లారం సర్పంచ్ గొంది సుదర్శన్ రెడ్డి, తూముకుంట సర్పంచ్ పలుస రామన్ గౌడ్, నాగర్ల బండ తండా సర్పంచ్ గోపాల్ నాయక్, కొండూరు సర్పంచ్ ధర్మ తేజ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికారులు పాల్గొన్నారు

Next Story