- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో నిరుపేదలకు అన్యాయం
ఇండ్ల కేటాయింపుపై విచారణ చేపట్టాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో నిరుపేదలకు అన్యాయం
-ఇండ్ల కేటాయింపుపై విచారణ చేపట్టాలి
-ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
దిశ, కొల్లాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహాల కేటాయింపులో అవకతవకలు జరిగి అర్హులైన నిరుపేదలు నష్టపోతున్నారని ఆరోపిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం. బాల నరసింహ, జిల్లా కార్యదర్శి ఎస్.ఎం.డి. ఫయాజ్ మాట్లాడుతూ, గడచిన పదేళ్లుగా ఇల్లు లేని పేదలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నప్పటికీ, ప్రస్తుత కేటాయింపుల్లో అర్హులను పక్కనబెట్టి అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఒక్కొక్క గ్రామానికి అవసరమైన సంఖ్యలో ఇళ్లు కేటాయించకుండా 15–20 ఇండ్లతో మాత్రమే లబ్ధిదారుల పేర్లు ప్రకటించారని, జాబితాలను గోప్యంగా ఉంచి పారదర్శకత లేకుండా వ్యవహరించారని, కొందరికి ఇప్పటికే ఆస్తులు, ఇళ్లు ఉన్నప్పటికీ వారికే మరోసారి ఇళ్లు మంజూరు కావడం వంటి అవకతవకలు జరిగాయని విమర్శించారు. సిపిఐ నేతలు, "ఈ కేటాయింపుల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. బాధ్యులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. నిజమైన లబ్ధిదారుల పేర్ల జాబితాలను అన్ని గ్రామపంచాయతీల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి" అని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోతే రాష్ట్ర ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. "అవసరమైన సవరణలు తక్షణమే చేయకపోతే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున పోరాటాలు ప్రారంభిస్తాం" అని వారు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో సిపిఐ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఆర్. ఇందిర, జి. కురుమయ్య, టి. కిరణ్‌కుమార్, బండి లక్ష్మీపతి, పట్టణ కార్యదర్శి ఎం.డి. యూసుఫ్, మండల నాయకులు జంగం శివుడు, చందు, శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శివకృష్ణ, గుర్రం శేఖర్, దాము, రమేష్, వెంకటస్వామి, కే. శివ, ఎం.డి. రుక్ముద్దీన్, డి. పవన్, సత్యం, గోవింద్ రెడ్డి, వెంకటమ్మ, చెన్నమ్మ, రాములమ్మ, ఎల్లమ్మ, పద్మ, లోకేశ్వరి, లక్ష్మమ్మ, ఈశ్వరమ్మ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పేద మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు.






