ఎడతెరిపిలేని వానలు

by Elthuri vijay kumar |

మహమ్మదాబాద్ మండలంలోని గాధిర్యాల్ గ్రామం పరిసరాలు గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జలమయంగా మారాయి.

ఎడతెరిపిలేని వానలు
X

ఎడతెరిపిలేని వానలు

పొంగుతున్న వాగులు, మత్తళ్లు పోస్తున్న చెరువులు

జలదిగ్బంధంలో గాధిర్యాల్ గ్రామం

గ్రామానికి తెగిపోయిన రవాణా సౌకర్యం

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

దిశ,మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండలంలోని గాధిర్యాల్ గ్రామం పరిసరాలు గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జలమయంగా మారాయి. ఈ వర్షాల ప్రభావంతో గ్రామంలోని కొత్త చెరువు, ఊర చెరువు అలుగులు పొంగిపొర్లడంతో గ్రామానికి ఆనుకుని ఉన్న రహదారులు పూర్తిగా నీటితో మునిగిపోయాయి. దీంతో గాధిర్యాల్ గ్రామం నుండి బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోయి, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రవాణా సౌకర్యాం లేక ఇబ్బందులు:

భారీ వర్షాల కారణంగా గాధిర్యాల్ – మొకార్లబాద్, గాధిర్యాల్ – రహదారి బందు, గాధిర్యాల్ గేట్ – రహదారి బందు, ఆముదాలగడ్డ తాండాకు వెళ్లే మార్గాలు పూర్తిగా నీటిలో మునిగాయి. ఈ పరిస్థితుల్లో గ్రామస్తులు బయటకు రాకుండా దిగ్బంధంలో చిక్కుకున్నారు. మండల కేంద్రం మరియు జిల్లా కేంద్రాలకు చేరే మార్గాలు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

గ్రామస్తుల ఆవేదన:

అత్యవసర పనుల కోసం లేదా వైద్య సేవల కోసం బయటకు వెళ్లాలన్నా మాకు మార్గం లేదు. గాధిర్యాల్ నుండి గాధిర్యాల్ గేట్ మధ్య ఒక వంతెన నిర్మాణం అత్యవసరంగా అవసరం. లేకపోతే, ప్రతి వర్షాకాలంలో ఇలాంటి సమస్యలు తప్పవు, అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్షాల కారణంగా రోజువారీ కార్యకలాపాలు, వ్యవసాయ కార్యకలాపాలు స్తంభించాయని, దీనివల్ల తమ జీవనోపాధి కూడా దెబ్బతిన్నదని వారు తెలిపారు.

అధికారులకు విజ్ఞప్తి

గ్రామ ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా, గాధిర్యాల్ గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు సంధానం కల్పించే వంతెన నిర్మాణం, రహదారుల మరమ్మతు, మరియు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. "ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చొరవ తీసుకోవాలి, అని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

సహాయ చర్యలు చేపట్టాలి

ప్రస్తుతం గాధిర్యాల్ గ్రామంలో వర్షాలు తగ్గడం లేదు. రహదారులు ఇంకా వినియోగానికి పనికిరాకుండా ఉన్నాయి. అధికారులు సమస్యను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది, కానీ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఘటన గాధిర్యాల్ గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ రవాణా, రోజువారీ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వర్షాలు మరియు వరదల వల్ల గాధిర్యాల్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Next Story