దుందుభి నదిలో చీకటి దందా

by Ratna Kumari |

స్థానిక ఎన్నికల జోరు అనంతరం ఇసుక మాఫియా పంజా విప్పింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని మొల్గర దుందుభి నదిలో చీకటి దందా హవా జోరుగా కొనసాగుతుంది.

దుందుభి నదిలో చీకటి దందా
X

దిశ, ఉప్పునుంతల : స్థానిక ఎన్నికల జోరు అనంతరం ఇసుక మాఫియా పంజా విప్పింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని మొల్గర దుందుభి నదిలో చీకటి దందా హవా జోరుగా కొనసాగుతోంది. అక్రమంగా 50 నుంచి 80 ట్రాక్టర్లు అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. అయినా సంబంధిత శాఖ మైనింగ్, రెవెన్యూ,పోలీస్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనీ ప్రజలు మండిపడుతున్నారు.

ఓ వైపు అధికార.. మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష నేత‌లు

మొల్గర గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతలు ఓ వైపు ప్రతి పక్ష పార్టీ నేతలు మరో వైపు దుందుభి నదిని భాగాలుగా పంచుకొని హోరాహోరీగా రాత్రి వేళల్లో అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నారు. లక్షల్లో క్వారీలు కొనుగోళ్లు చేసి దందా సాగిస్తున్నారంటే దందా ఏ స్థాయిలో కొనసాగుతుందో ఇట్టే అర్థం అవుతుంది.

ఆ గ్రామాల ప్రజలకు నిద్ర కరువు..

రాత్రి వేళల్లో నడిచే ట్రాక్టర్ల మోతకు మొల్గర,జప్తి సదగోడు గ్రామాలకు చెందిన ప్రజలకు నిద్ర కరువైందని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అక్రమ ఇసుకను కట్టడి చెయ్యడంలో సంబంధిత అధికారులు విఫలం అయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి నిత్యం పొలాల్లో పొద్దస్తమానం పనులు చేసి రాత్రిళ్ళు కంటినిండా నిద్ర కరువైందని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ పేరుతో పైకం వసూళ్లు

ఈ అక్రమ ఇసుక రవాణాకు మొల్గర గ్రామ పంచాయతీ పైకం వసూళ్లు చెయ్యటం గ్రామ పంచాయతీ పేరుతో ఒక్కో ట్రాక్టర్ కు గ్రామానికి చెందిన లోకల్ ట్రాక్టర్ కు 3500 నాన్ లోకల్ (బయటి గ్రామాల ట్రాక్టర్లకు)7 వేలు నెలకు వసూళ్లు చెయ్యటం దుమారం రేగుతుంది. దీంతో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య వైరం పెరిగి ఎంతటికి దారి తీస్తుందో అని చర్చించుకుంటున్నారు స్థానికులు.

రాత్రిళ్ళు నిద్ర రావడంలేదు కృపానందం మొల్గర గ్రామస్థుడు

రాత్రిళ్ళు ట్రాక్టర్ల చప్పుడుకు నిద్ర రావడంలేదు. ఒకటే దడ దడ చప్పుడు పట్టించుకునే వారే లేరు. ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి.ప్రజల ఇబ్బందులు తొలగించాలి. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story