గోకారం చెరువు నుంచి ఇసుక అక్రమ రవాణా

by Ajay Maddhiboyina |

చారకొండ మండలంలోని గోకారం చెరువు నుంచి నిత్యం జోరుగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. మండల వ్యాప్తంగా కొన్ని రోజులుగా గోకారం చెరువుతోపాటు మండల కేంద్రంలోని పలు వాగుల నుంచి అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు.

గోకారం చెరువు నుంచి ఇసుక అక్రమ రవాణా
X

దిశ, చారకొండ : చారకొండ మండలంలోని గోకారం చెరువు నుంచి నిత్యం జోరుగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. మండల వ్యాప్తంగా కొన్ని రోజులుగా గోకారం చెరువుతోపాటు మండల కేంద్రంలోని పలు వాగుల నుంచి అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.4వేల చొప్పున అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు ప్రభుత్వ అధికారుల అండదండలతోపాటు రాజకీయ నేతల పలుకుబడి ఉండడంతో జోరుగా కొనసాగుతుందని ప్రజల ఆరోపిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ యజమాని రోజుకు రూ.2000 చొప్పున అధికారులకు ముడుపుల రూపంలో చెల్లిస్తున్నట్లు లోగుట్టు సమాచారం. గోకారం చెరువు నుంచి ఇసుక అక్రమ రవాణా చేయడం వల్ల పరిసర ప్రాంతాల్లో బోర్లు అడుగంటి నీటి కొరత నెలకొనే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించడం వల్ల స్థానికంగా ఇండ్ల, తదితర నిర్మాణాల కోసం ఇసుక కొరత ఏర్పడే అవకాశం ఉంది. గోకారం చెరువులో ఇతర మండలాల ట్రాక్టర్లు సైతం ఇసుకను అక్రమంగా తరలించడం గమనార్హం.

స్థానికులకు లభించని ఇసుక...

గోకారం గ్రామంలో ఓ దేవాలయం కోసం ఇసుక కావాలని తహశీల్దార్ ను గ్రామస్తులు కలవగా కలెక్టర్ నుంచి పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలని తేల్చి చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. దేవాలయ నిర్మాణం కోసం ఇసుక ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల పట్ల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇసుక రవాణాపై నియంత్రణ కరువు..

చారకొండ మండల కేంద్రంలోని గోకారం చెరువు నుంచి ఇసుక అక్రమ రవాణాపై ప్రజలు ఫిర్యాదు చేస్తే తప్పా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించడం లేదని సమాచారం.

తహశీల్దార్ వివరణ...

గోకారం చెరువు నుంచి ఇసుక అక్రమ రవాణా గురించి తహశీల్దార్ సునీతను వివరణ కోరగా మండల కేంద్రంలో ఎవరికి ఇసుక అనుమతులు ఇవ్వలేదని, పోలీస్ శాఖ సహకారంతో కేసులు నమోదు చేసి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని పేర్కొన్నారు.

Next Story