- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక అక్రమ డంపులు.. మక్తల్ నియోజకవర్గంలో ఆగని అక్రమ దందా.!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్రమ దందా యదేచ్ఛగా సాగుతోంది.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్రమ దందా యదేచ్ఛగా సాగుతోంది. కొన్ని వారాలుగా ఆన్లైన్ అనుమతులు లేకపోవడంతో ప్రజా ప్రతినిధులు, అధికారుల అండదండలతో కొంతమంది అక్రమ దందా చేసే వ్యాపారులు తమకు అందుబాటులో ఉన్న చోట్ల నుంచి ఇసుకను తరలించి రహస్య ప్రదేశాలలో డంపులు చేస్తున్నారు. అనుమతులు వచ్చే అవకాశాలు లేకపోవడంతో రాత్రివేళలో ఇసుకను తరలిస్తున్నారు. ఈ ఇసుక నారాయణపేట జిల్లాతో పాటు, మహబూబ్ నగర్, హైదరాబాదుకు భారీ ఎత్తున తరలతోందని ఫిర్యాదులు వస్తున్నాయి. రెగ్యులర్ అధికారులు బదిలీ కావడం.. కొత్తగా అధికారులు రాకపోవడంతో బాధ్యతలు నిర్వహిస్తున్న కిందిస్థాయి ఉద్యోగులు అక్రమ ఇసుక రవాణాకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
భారీగా డిమాండ్...
వర్షాలు విస్తారంగా కురుస్తుండడం, ఆన్లైన్ అనుమతులు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఇసుకకు పెద్ద ఎత్తున మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. ఇండ్లు, వ్యాపార సంస్థలతోపాటు ప్రభుత్వ పనులకు కూడా ఇసుక అవసరం ఉండడం.. ఆన్లైన్ అనుమతులు లేకపోవడంతో అక్రమార్కులకు కాసుల కురుస్తున్నాయి. మక్తల్, నారాయణపేట జిల్లా పరిధిలో టిప్పర్ ఒక్క ఇంటికి రూ.30వేలనుంచి రూ.35వేలు డిమాండ్ చేస్తూ, మహబూబ్ నగర్ జిల్లా వరకు ఇసుక సరఫరా చేయాల్సి వస్తోంది. రూ.40వేల నుంచి 45వేలు, హైదరాబాద్ తీసుకువెళ్తే రూ.50వేల నుంచి రూ.55వేల వరకూ వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కులు ఎలాగైనా ఇసుక రవాణా చేసి పెద్ద మొత్తంలో సంపాదించడానికి ఎత్తుగడలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీలు చిక్కినప్పుడల్లా మాగనూరు మండల పరిధిలోని దాసరపల్లి, వర్కూరు గ్రామాల శివారులో పెద్ద ఎత్తున ఇసుక డంపులు ఏర్పాటవుతున్నాయి.
ఒకరిపై ఒకరు ఫిర్యాదుతో..
అక్రమ ఇసుక రవాణా అంశంలో వ్యాపారస్తుల మధ్య పోటీ తత్వం నెలకొని ఒకరిపైమరొకరు అధికారులకు ఫిర్యాదు చేయడం.. మరికొన్ని సందర్భాలలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక వ్యాపారంపై వార్తా కథనాలు వస్తే సంబంధిత శాఖల అధికారులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా వివరణలు ఇచ్చుకుంటూ.. ఇటు అక్రమార్కుల నుంచి వచ్చే కాసులకు కక్కుర్తి పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుంటే .. ఇసుక వ్యాపారం అక్రమార్కుల సంపాదనకు మార్గంగా మారుతుందని పలువురు అంటున్నారు.






