- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్‌లొ ఖతర్నాక్ డ్రాపౌట్.. కట్ చేస్తే ఏకంగా రూ.64 కోట్ల సైబర్ మోసం
దేశవ్యాప్తంగా రూ. 64 కోట్ల సైబర్ ఫ్రాడ్ వెనుక మాస్టర్ మైండ్ ఓ 18 ఏళ్ల ఇంటర్ డ్రాపౌట్ స్టూడెంట్ ఉన్నాడని పోలీసులు గుర్తించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పెరుగుతున్న టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఏఐ రాకతో సైబర్ నేరగాళ్ల పని మరింత సులభతరంగా మారింది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సైబర్ ఫ్రాడ్ బాధితులుగా మారుతున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా దాదాపు రూ.64.38 కోట్ల సైబర్ దోపిడీకి పాల్పడిన ముఠా వెనుక మాస్టర్ మైండ్ ఓ ఇంటర్ డ్రాపౌట్ స్టూడెంట్ అని పోలీసుల విచారణలో తేలడం సర్వత్రా షాక్ కు గురి చేసింది. AI సాంకేతికతను మంచికి కాకుండా నేరాలకు వాడితే ఎంతటి ప్రమాదమో చాటిచెప్పే ఈ ఘటన తాజాగా గుజరాత్‌లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన 18 ఏళ్ల రోహిత్ వీరేంద్ర సింగ్ శాక్య ఏఐని ఉపయోగించుకుని ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన ఏపీకే యాప్‍లను తయారు చేసి దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ సిండికేట్లకు సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
రూ.5 లక్షల మోసంతో గుట్టు రట్టు:
ఈ ఏడాది మే లో సూరత్‌కు చెందిన ఒక బాధితుడికి వాట్సాప్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB One) యాప్‌ను పోలిన ఒక APK ఫైల్ వచ్చింది. అది అసలైన యాప్ అని నమ్మి డౌన్‌లోడ్ చేసుకున్న కాసేపటికే బాధితుడి ప్రైమ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతా నుండి రూ.5 లక్షలు విడతల వారీగా డబ్బులు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సూరత్ సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు మొదలు పెట్టగా ఈ నకిలీ యాప్‌ల వెనుక ఉన్న అసలు సూత్రధారి రోహిత్ అని తేల్చారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన రోహిత్ వీరేంద్ర సింగ్ శాక్యను కాన్పూర్‌లోని ఒక హోటల్‌లో దాడి చేసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లుతో పాటు ఆయా డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏఐ సాయంతో 16 ఏళ్లకే సైబర్ నేరాలు:
అయితే పోలీసుల దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 11వ తరగతి డ్రాపౌట్ అయిన రోహిత్... ఏఐ టూల్స్, టెలిగ్రామ్ ద్వారా కోడింగ్ నేర్చుకుని 16 ఏళ్ల వయస్సు నుంచే ఈ సైబర్ నేరాల బాట పట్టినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరమైన నకిలీ యాప్‌లు (APK ఫైల్స్) తయారు చేయడంలో దిట్టగా మారినట్లు తెలుసుకున్నారు. నిందితుడు రెండు రకాల అప్లికేషన్‌లను అభివృద్ధి చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మొదటి అప్లికేషన్ బాధితుడి పరికరంలో ఇన్‌స్టాల్ చేయడానికి రూపొందించినది కాగా రెండవది అడ్మిన్ అప్లికేషన్‌గా పనిచేస్తుంది. ఈ అడ్మిన్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుడి మొబైల్ ఫోన్‌లోని ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలతో పాటు ఇతర సున్నితమైన సమాచారాన్ని రియల్ టైమ్‍లో చూడగలిగేలా రూపొందించాడు. ఈ నకిలీ యాప్‍లను సబ్ స్క్రిప్షన్ మోడల్‍లో దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ సిండికెట్ ముఠాలకు రోహిత్ విక్రయించినట్లు పోలీసు తెలిపారు. ఈ యాప్‍లను విక్రయించడానికి రోహిత్ ప్రతి నెల ముఠాల వద్దనుంచి రూ.15 వేలు వసూలు చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
అవసరాన్ని బట్టి యాప్:
రోహిత్ తన క్లయింట్ అవసరాల ఆధారంగా బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు, ప్రధాన కంపెనీల అప్లికేషన్లను పోలిన నకిలీ అప్లికేషన్లను సృష్టించేవాడని పోలీసులు తెలిపారు. వీటిలో PNB, SBI, యాక్సిస్ బ్యాంక్, UCO బ్యాంక్, బిగ్‌బాస్కెట్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మరియు RTO చలాన్ సేవలకు సంబంధించిన అప్లికేషన్లు మరియు చెల్లింపు లింకుల మోసపూరిత వెర్షన్లు ఉన్నట్లు తెలిపారు. ఝార్ఖండ్‌లోని ప్రసిద్ధ జమ్‌తారా, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన అనేక సైబర్ నేరస్థుల ముఠాలు ఇతని వద్ద నుంచే ఈ వైరస్ ఉన్న యాప్‌లను కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మిగతా ముఠా సభ్యులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఓ ఇంటర్ డ్రాపౌట్ స్టూడెంట్ దేశవ్యాప్తంగా సైబర్ సిండికేట్ ముఠాలకు ఏపీకే ఫైల్స్ సరఫరా చేసేంత స్థాయికి ఎదగడం ఇప్పుడు హాట్ టాపిక్‍గా మారింది.






