- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తహసీల్దార్ కార్యాలయంలో వసూళ్ల దందా.. రిజిస్ట్రేషన్ల పేరుతో అడ్డగోలు దోపిడీ
అన్నదాతకు అండగా ఉండాల్సిన రెవెన్యూ కార్యాలయం కాస్తా, అవినీతి తిమింగలాలకు నిలయంగా మారింది. ‘మీ సేవ’లో ప్రభుత్వ ఫీజులు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకుని, నిబంధనల ప్రకారం భూముల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న రైతులకు మిడ్జిల్ తహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.

దిశ, మిడ్జిల్: అన్నదాతకు అండగా ఉండాల్సిన రెవెన్యూ కార్యాలయం కాస్తా, అవినీతి తిమింగలాలకు నిలయంగా మారింది. ‘మీ సేవ’లో ప్రభుత్వ ఫీజులు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకుని, నిబంధనల ప్రకారం భూముల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్న రైతులకు మిడ్జిల్ తహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫైల్ కదలాలన్నా, సంతకం పడాలన్నా చేతులు నలపాల్సిందే. లంచం ఇస్తేనే ఫైలు ముందుకు సాగుతుందని, లేదంటే లేనిపోని సాకులు, కొర్రీలు పెడుతూ రైతులను కార్యాలయం చుట్టూ ముప్పతిప్పలు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పనికి రేట్ ఫిక్స్ ...
భూమి విలువ, విస్తీర్ణాన్ని బట్టి కిందిస్థాయి సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. ఒక్కో ఫైలుకు రూ.1,000 నుంచి రూ.2,000... అవసరాన్ని బట్టి రూ.10,000 వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలోని కొందరు సిబ్బంది రూ.2,000 నుండి రూ.4,000 వసూలు చేస్తున్న దృశ్యాలు, బాధితుల ఆవేదనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అడిగినంత ఇచ్చుకోకుంటే "ఈ కాగితం లేదు.. ఆ పత్రం సరిగ్గా లేదు" అంటూ ఫైళ్లను వెనక్కి తిప్పి పంపుతున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో దూరప్రాంతాల నుండి వచ్చే రైతులు ఎండ తీవ్రతకు గంటల తరబడి కార్యాలయం బయటే నిరీక్షించాల్సి వస్తోంది.
బాధ్యులపై కఠిన చర్యలు: రాఘవేందర్ రెడ్డి, తాసీల్దార్
మండలంలో రెవిన్యూ సిబ్బంది పనులు చేస్తామంటూ నగదు తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు ఎవరూ కూడా ఎవరికీ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. పనులు న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, తీసుకున్నా బాధితులు తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.






