రాత్రయితే రాకపోకలు బంద్.. జేబీఎస్ నుంచి కామారెడ్డికి బస్సులు కరువు

by Ajay Maddhiboyina |

కామారెడ్డి నుంచి వివిధ పనుల నిమిత్తం హైదరాబాదుకు వెళ్లిన ప్రయాణికులు పనులు ముగించుకొని జేబీఎస్ కు చేరుకోగానే సాయంత్రం ఐదు అయిందంటే ఒక్క బస్సు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

రాత్రయితే రాకపోకలు బంద్.. జేబీఎస్ నుంచి కామారెడ్డికి బస్సులు కరువు
X

కామారెడ్డి నుంచి వివిధ పనుల నిమిత్తం హైదరాబాదుకు వెళ్లిన ప్రయాణికులు పనులు ముగించుకొని జేబీఎస్ కు చేరుకోగానే సాయంత్రం ఐదు అయిందంటే ఒక్క బస్సు కూడా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కామారెడ్డి వెళ్లే బస్సులు ఇక్కడి నుంచి లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అన్ని రూట్లలో బస్సులు నడుపుతున్న ఆర్టీసీ కామారెడ్డి రూట్ లోనే బస్సులు ఎందుకు నడపడం లేదని, ఆర్టీసీకి ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ డిపో అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. హైదరాబాదుకు వివిధ పనుల నిమి త్తం వెళ్లిన ప్రయాణికులు సాయంత్రం పనులు ముగించుకొని కామారెడ్డికి బయలుదేరుదామంటే జూబ్లీ బస్టాండ్ లో బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పైనే ఆర్టీసీ ఎందుకంత కక్ష కట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు సుమారు 100కు పైగా బస్టాండ్ లో రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్నారు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి రూట్లో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు రాత్రిపూట ఎక్కడ బస చేయాలో తెలియక బస్సుల కోసం ఎదురుచూస్తూ బేజారవుతున్నారు. ఎక్కడ బస చేయాలో తెలియక బస్టాండ్ లోనే కొంతమంది నిరీక్షిస్తుండగా మరికొందరు మాత్రం ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు.

ఇతర బస్సులే ఆధారం...

రాత్రి 8తర్వాత ఒకటి నాందేడ్ బస్సు, మరొకటి బైంసా బస్సు తప్పితే అన్ని నాన్ స్టాప్ బస్సులే ఉండడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. మహిళ ప్రయాణికులు, చిన్న పిల్లలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి రూట్ లో సాయంత్రం అయిందంటే బస్సులు లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులను తమ వాహనాల్లో తరలిస్తున్నారు. అది కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ తరలిస్తున్నప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు అడిగిన కాడికి ముట్ట చెబుతూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

కామారెడ్డి డిపో వారు బస్సులు నడపరా...

కామారెడ్డికి చెందిన ఆర్టీసీ డిపోవారు జూబ్లీ బస్టాండ్ కు సాయంత్రం అయిందంటే బస్సులు నడపకపోవడంతోనే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కామారెడ్డి ప్రయాణికులను ఏ డిపో వారు తమ గమ్యస్థానాలకు చేర్చుతారని ప్రయాణికులు కామారెడ్డి ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కామారెడ్డి ఆర్టీసీ డిపో అధికారులు స్పందించి సాయంత్రం నుండి రాత్రి వేళలో కూడా బస్సులు నడిపి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

బస్సులు లేక కారు మాట్లాడుకుని వచ్చాం..

హైదరాబాద్ వేరే పని మీద బస్సుకు వెళ్లాం. సాయంత్రం తిరుగు ప్రయాణంలో జూబ్లీ బస్టాండ్ కు చేరుకోగా కామారెడ్డికి ఒక్క బస్సు కూడా లేకపోవడంతో ఈ విషయమై కంట్రోలర్ ను అడిగాము. సాయంత్రం నుంచి కామారెడ్డి ఆర్టీసీ డిపో నుండి బస్సులు ఇక్కడికి రావు, ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం లో ఉండవు.. వేరే డిపోల బస్సులు మాత్రమే వస్తాయి అని చెప్పడం గమనార్హం.దీంతో చేసేది లేక కారు బుక్ చేసుకుని కామారెడ్డి వచ్చాము.

కృష్ణాగౌడ్, ప్రయాణికుడు, కామారెడ్డి

Next Story