- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ డిప్యూటేషన్లు.. ఉద్యోగుల ఇష్టారాజ్యం!
కరీంనగర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న డిప్యూటేషన్ల పర్వం కలకలం రేపుతోంది. కొంతమంది ఉద్యోగులు రాజకీయ పలుకుబడితో 317 జీఓను ఉల్లంఘిస్తూ 30ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయారు.

కరీంనగర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న డిప్యూటేషన్ల పర్వం కలకలం రేపుతోంది. కొంతమంది ఉద్యోగులు రాజకీయ పలుకుబడితో 317 జీఓను ఉల్లంఘిస్తూ 30ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయారు. ప్రమోషన్లపై ఇతర జిల్లాలకు బదిలీ అయినా, మళ్లీ పైరవీలు చేసుకుని కరీంనగర్ కార్యాలయానికే చేరుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో సిబ్బంది కొరత ఉన్నా, ప్రధాన కార్యాలయంలో పోస్టులు లేకపోయినా ఇద్దరేసి చొప్పున కేటాయించారు. హుస్నాబాద్ గణిత ఉపాధ్యాయుడిని ఆఫీస్ పనికి మార్చడంతో అక్కడ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల వసతి గృహాలు మూతపడుతున్నాయని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేసి గిరిజన సంక్షేమ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
- దిశ, కరీంనగర్ బ్యూరో
దిశ, కరీంనగర్ బ్యూరో : పట్టించుకునే వారు లేకపోవడంతో గిరిజన సంక్షేమ శాఖలో ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలోని పెద్దలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని, ఆ పలుకుబడిని ఉపయోగించుకుంటూ జీఓలను ఉల్లంఘిస్తున్నారు. డిప్యూటేషన్ పేరుతో ఏళ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వర్తిస్తూ బదిలీ అనే పదాన్నే తమ సర్వీసు నుంచి తొలగించుకుంటున్నారు. ఉద్యోగం పొందిన నాటి నుంచి రిటైర్మెంట్ వరకు ఒకే చోట విధులు నిర్వర్తించేందుకు దారులు వెతుక్కుంటూ పాతుకుపోతున్నారు. కరీంనగర్‌లోని గిరిజన సంక్షేమ శాఖ అధికారుల తీరుపై గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.
317 జీఓను ఉల్లంఘిస్తూ డిప్యూటేషన్లు...
కరీంనగర్ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ డిప్యూటేషన్ పేరిట ఏళ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వర్తించడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నేటి వరకు సుమారుగా 30ఏళ్లుగా ఇక్కడే విధులు నిర్వర్తించడం, ప్రమోషన్లు పొంది ఇతర జోన్లకు బదిలీ అయినప్పటికీ, 317 జీఓను ఉల్లంఘిస్తూ మళ్లీ ఇక్కడికే డిప్యూటేషన్లు పొందడం గమనార్హం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, రెండు ఆశ్రమ పాఠశాలలు ఉండగా, వాటిలో సిబ్బంది కొరత వేధిస్తున్నప్పటికీ జిల్లా ప్రధాన కార్యాలయంలో మాత్రం పరిమితికి మించి ఎక్కువ మంది ఉద్యోగులను కేటాయిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
నిర్వీర్యం అవుతున్న పాఠశాలలు...
అధికారుల తీరుతో గిరిజన సంక్షేమ శాఖ పూర్తిగా నిర్వీర్యం అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కార్యాలయంలో అవసరం లేకపోయినా పరిమితికి మించి సిబ్బందిని కేటాయించగా, వార్డెన్ స్థాయి ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కేటాయించడం, బోధన సిబ్బందికి ఏసీఓగా బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారుల అనాలోచిత విధానాలతో ఇప్పటికే సైదాపూర్ గిరిజన వసతి గృహం మూసివేయగా, భవిష్యత్తులో మరిన్ని వసతి గృహాలు మూతపడే ప్రమాదం లేకపోలేదు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు చేయడం వలన హుస్నాబాద్‌లోని గిరిజన సంక్షేమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి నూతన అడ్మిషన్లు రావడం లేదు. అక్కడ పనిచేసే గణిత ఉపాధ్యాయుడిని నిబంధనలకు విరుద్ధంగా కరీంనగర్‌కు డిప్యూటేషన్ ఇచ్చారని, ప్రమోషన్ పై ఆసిఫాబాద్‌కు బదిలీ అయిన ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారిని మళ్లీ ఇక్కడికే కేటాయించారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
ప్రభుత్వ విధానాలతోనే ఇక్కడ ఉద్యోగం..
ప్రభుత్వ విధానాలతోనే మేము ఇక్కడ కొనసాగుతున్నాం. మేము వేరే జిల్లాకు పోయే వెసులుబాటు గిరిజన సంక్షేమ శాఖలో లేదు. అందుకే సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వం బదిలీ చేస్తే మేము ఎక్కడికైనా వెళ్తాం.
- సంగీత, ఇంచార్జ్ డీటీడీఓ.
ఎక్కడైనా ఉద్యోగం చేస్తాం
నేను ఇక్కడే ఉద్యోగంలో చేరాను. గత 28ఏళ్లుగా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నాను. 2023లో ప్రమోషన్ పై ఆసిఫాబాద్ వెళ్లాను. అంతకంటే ముందు కొద్ది రోజులు మరోచోట విధులు నిర్వర్తించాను. అయితే ఆసిఫాబాద్‌లో నా పోస్టు ఖాళీ లేకపోవడం, ఇక్కడ పోస్టు ఖాళీ ఉండడంతో నాకు ఇక్కడికి డిప్యూటేషన్ ఇచ్చారు. పై అధికారులు బదిలీ చేస్తే ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం.
- గిరిధర్ రావు, సూపరింటెండెంట్, గిరిజన సంక్షేమ శాఖ






