- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి: ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల పట్టణంలో రాజకీయం వేడెక్కింది.

దిశ, జోగులాంబ ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల పట్టణంలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గద్వాల మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీచేస్తున్న మొత్తం 37 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని పట్టణ వీధుల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గద్వాల పట్టణ సర్వతోముఖాభివృద్ధి కేవలం అధికార పార్టీ కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. "మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించుకుని పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోగలమని, ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది అని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఫిరాయింపుల వివాదం మధ్యే ప్రచారం..
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అనంతరం కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనపై పార్టీ ఫిరాయింపుల కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నప్పటికీ, ఆయన పూర్తిస్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచార బరిలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాంకేతికంగా తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని ఆయన చెబుతూనే, కాంగ్రెస్ గెలుపు కోసం గద్వాల పట్టణంలో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారు. పార్టీ ఫిరాయింపుల కేసు పెండింగ్‌లో ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో విజయం కోసం భారీ ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతో ఆయన పాల్గొనడం గద్వాల పట్టణంలో సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు, డిసిసి ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, గడ్డం కృష్ణ రెడ్డి, నియోజకవర్గ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధుల అభ్యర్థులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరియు అభిమానులు భారీగా పాల్గొన్నారు.






