- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతులు ఆందోళన చేస్తుంటే. . మీరు సంబరాలు చేసుకుంటారా..!?

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : జూరాల నుంచి పంట పొలాలకు సాగునీరు విడుదల చేయకుంటే ఈ నెల 17న (గురువారం) రైతులతో కలిసి దీక్ష చేస్తానని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు. జూరాల ఎడమ కాలువ నుంచి సాగునీరు విడుదల కాకపోవడంతో.. దాదాపుగా 65 వేల ఎకరాలలో సాగు చేసినా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితికి ఏర్పడింది. మంగళవారం జూరాల వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో.. యుగంధర్ గౌడ్ బుధవారం జూరాల కు చేరుకొని మీడియాతో మాట్లాడారు. వర్షాలు పుష్కలంగా కురిసాయి, వరదలు పెద్ద ఎత్తున వచ్చాయి.. నీటిని చెరువులు,కుంటలలో నిలువ చేసుకోవడంలో ఎక్కడ పొరపాట్లు జరిగాయి..? రైతులు ఆందోళన చేస్తుంటే ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అంటూ యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి, ఎమ్మెల్యేలు కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడితే జూరాలకు నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అంగీకరించారని మీడియాకు చెప్పారు. కానీ ఇప్పటివరకు కర్ణాటక ప్రభుత్వం కేవలం ఒక టీఎంసీ నీటిని విడుదల చేయగా.. జూరాలకు చేరింది అర టీఎంసీ మాత్రమే అని యుగంధర్ గౌడ్ తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో సాగునీరు అందక రైతులు ఆందోళన చేస్తుంటే., ప్రజా ప్రతినిధులు సంబరాలు జరుపుకుంటున్నట్లు పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు సాయంత్రం వరకు జూరాల నుంచి సాగునీటిని విడుదల చేయకుంటే ఈనెల 17న జూరాల వద్ద రైతులతో కలిసి ఆందోళన చేస్తానని ఆయన హెచ్చరించారు.
యుగంధర్ గౌడ్ ప్రకటనతో అధికార పార్టీలో చర్చ
రాష్ట్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రకటనతో అధికార పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలయ్యింది. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రజా సమస్యలపై గళం విప్పుతూ వచ్చిన యుగంధర్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరకపోయిన ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి ఉంటూ .. కడప దడప ముఖ్యమంత్రి తోనూ సమావేశం అవుతూ వచ్చిన యుగంధర్ గౌడ్ ఇప్పుడు ఒక్కసారిగా అధికార పార్టీ శ్రేణులు అవాక్కు అయ్యేలా జూరాల అంశాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశం అవుతోంది. ఇదే విషయమై దిశ యుగంధర్ గౌడ్ ను వివరణ కోరగా.. ప్రజా సమస్యల పరిష్కారమే నాకు ప్రధానం అని పేర్కొన్నారు.