రైతు కన్నీరు.. యజమాని పన్నీరు

by Naga Rani Yarlagadda |

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఆశించిన మద్దతు ధర వస్తుందని ఆశపడిన రైతన్నలకు ఊహించని దెబ్బ తగిలింది.

రైతు కన్నీరు.. యజమాని పన్నీరు
X

దిశ, అలంపూర్​ : కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర వస్తుందని ఆశపడి కోల్డ్ స్టోరేజ్‌లో దాచుకున్న రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నమ్మిన యజమానే నట్టేట ముంచడంతో గద్వాల జిల్లాకు చెందిన రైతులు రోడ్డున పడ్డారు. గుంటూరులోని లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం రైతుల అనుమతి లేకుండానే సుమారు 1850 బస్తాల 'సూపర్-10' రకం మిర్చిని విక్రయించేయడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. తమకు సమాచారం లేకుండానే తమ పంటను ఎలా అమ్ముతారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మద్దతు ధర ఆశతో వచ్చి మోసపోయి..

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి చెందిన సాయిబాబా, నాగశేషి, బజారి, రాముడు, విజయ్, నాగరాజు, రమేష్ వంటి రైతులు 2023లో తమ మిర్చి పంటను గుంటూరులోని లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరిచారు. మార్కెట్‌లో సరైన ధర వచ్చినప్పుడు విక్రయించి అప్పులు తీర్చుకోవాలని వారు భావించారు. అయితే మార్కెట్‌లో ధరలు పెరిగిన తరుణాన్ని గమనించిన కోల్డ్ స్టోరేజ్ యజమాని, రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా మిర్చిని అమ్మేసుకున్నాడు. నెల రోజులుగా యజమాని చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై రైతుల అసహనం

తమ గోడును వినేవారే కరువయ్యారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజులుగా గుంటూరులోనే ఉంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, మార్కెట్ అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటను దొంగచాటుగా అమ్మేస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. తమకు తక్షణమే న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదనతో హెచ్చరించారు.

రంగంలోకి మార్కెట్ యార్డ్ చైర్మన్

బాధిత రైతుల గోడును గమనించిన గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్ర అప్పారావుకు రైతులు వినతిపత్రం అందజేశారు. దీనిపై తక్షణమే స్పందించిన ఆయన, శనివారం సాయంత్రం లోపు పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించేలా చొరవ చూపుతామని స్పష్టం చేయడంతో రైతులు కొంత ఊరట చెందారు. చైర్మన్ ఇచ్చిన భరోసాతో ప్రస్తుతం రైతులు గుంటూరులోనే వేచి చూస్తున్నారు.

పాలనా వ్యవస్థపై పలు అనుమానాలు

ఈ ఘటన గుంటూరు జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ యజమానుల ఆగడాలను ఎత్తి చూపుతోంది. రాజకీయ అండదండలతోనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ చూపి గద్వాల జిల్లా రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు.

Next Story