గొల్లపల్లి గడ్డపై 'నీళ్ల' రాజకీయం : వనపర్తిలో పతాక స్థాయికి పొలిటికల్ సెగ!

by Naga Rani Yarlagadda |

గొల్లపల్లి-చీర్కేపల్లి రిజర్వాయర్ నిర్మాణం అంశం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకు దారితీసింది.

గొల్లపల్లి గడ్డపై నీళ్ల రాజకీయం : వనపర్తిలో పతాక స్థాయికి పొలిటికల్ సెగ!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : పచ్చని పొలాలకు నీళ్లివ్వాల్సిన ప్రాజెక్టు.. ఇప్పుడు రాజకీయ సెగలు పుట్టిస్తోంది. వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి-చీర్కేపల్లి రిజర్వాయర్ నిర్మాణం అంశం జిల్లా సరిహద్దులు దాటి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు తామే ప్రతిపాదించి, నిధులు కేటాయించిన ప్రాజెక్టును ఇప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుండగా.. అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఎలాగైనా పూర్తి చేస్తామని పట్టుబడుతోంది. ఈ క్రమంలో గొల్లపల్లి వేదికగా సాగుతున్న 'నీళ్ల రాజకీయం' ఇప్పుడు పతాక స్థాయికి చేరింది.

వంద రోజులుగా ఆందోళనలు

గొల్లపల్లి.. చీర్కేపల్లి రిజర్వాయర్ నిర్మించవద్దంటూ స్థానిక రైతుల పేరిట సాగుతున్న రిలే దీక్షలు బుధవారంతో వంద రోజులకు చేరుకున్నాయి. మొదట్లో ఈ దీక్షలలో అన్ని పార్టీలు పాల్గొన్నప్పటికిని... క్రమక్రమంగా ఈ దీక్షలు బి ఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని ప్రచారం ప్రారంభమైంది. ఈ రిజర్వాయర్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి రైతులు, ప్రజల డిమాండ్ మేరకు రిజర్వాయర్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనను పతాక స్థాయికి తీసుకురావడానికి విస్తృత ప్రచారం చేశారు. ఇందులో భాగంగా బుధవారం భారీ బహిరంగ సభను గొల్లపల్లి వద్ద నిర్వహించేందుకు సన్నద్ధం అయ్యారు.. అధికారులు ఈ సభను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతులను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగే సభకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరుకానున్నారు. దీంతో వనపర్తి జిల్లాలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది.

సొంత ప్రయోజనాల కోసమే అడ్డుకుంటున్నారు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేఎల్ఐ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20కి పైగా ఎత్తిపోతలకు ఆమోదం లభించింది. అందులో గొల్లపల్లి.. చీర్కేపల్లి రిజర్వాయర్ కూడా ఉంది. దాదాపుగా 40 వేల ఎకరాలకు సాగు నీటిని అందించే లక్ష్యంతో 2.810 టీఎంసీల నీటిని నిలువ ఉంచేలా ఈ రిజర్వాయర్ ను నిర్మించాలని అప్పట్లో నిధుల కేటాయింపులు జరిగి టెండర్లు కూడా వేశారు. కరోనా తదితర కారణాలవల్ల రిజర్వాయర్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతుండడంతో రైతులు వ్యతిరేకిస్తున్నారన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ రైతులు వ్యతిరేకించే రిజర్వాయర్లు అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి గోపాల్ పేట మండలంలో రైతులు భూములను పెద్ద ఎత్తున కోల్పోయారు అని .. వెంటనే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు రిజర్వాయర్లను మంజూరు చేసి నిధులను కేటాయించి ఇప్పుడు అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆలోచనలు చేస్తున్నారని ఎమ్మెల్యే మెఘారెడ్డి బాహాటంగా విమర్శిస్తున్నారు. అక్కడ కొంతమంది పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారని, ఆ భూములను కాపాడుకోవడానికి ఈ ఎత్తుగడలు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మొత్తం పైన రిజర్వాయర్ కారణంగా వనపర్తి జిల్లా రాజకీయాలు రాష్ట్రస్థాయిలో చర్చకు తెర లేపాయి.

పై చేయి ఎవరిదో..

ఈ రిజర్వాయర్ వివాదం రాజకీయంగా ఎవరికి కలిసొస్తుందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఒక వర్గం ప్రజలు ప్రభుత్వం మారగానే ప్రాజెక్టును అడ్డుకోవడం అభివృద్ధిని అడ్డుకోవడమే అని అంటుండగా, భూములు కోల్పోయే నిర్వాసితుల పక్షాన నిలబడటమే సరైనదని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద గొల్లపల్లి గడ్డపై జరుగుతున్న ఈ నీళ్ల రాజకీయం రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వనపర్తి జిల్లాలో రాజకీయ సెగలు పతాక స్థాయికి చేరాయి.

Next Story